Burning Topic: యుద్ధం ముగింపుకు వచ్చినట్టేనా!

Burning Topic: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌత్య యత్నాలు. పుతిన్, జెలెన్‌స్కీలతో అమెరికా ప్రత్యేక బృందం కీలక చర్చలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2026 6:47 AM IST
Burning Topic
X

Burning Topic: యుద్ధం ముగింపుకు వచ్చినట్టేనా!

Burning Topic: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించింది. 2014 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లోని క్రిమియాను రష్యా ఆక్రమించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన తర్వాత రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర మొదలు పెట్టడంతో అసలు యుద్ధం ప్రారంభమైంది, రెండు వైపులా కలిపి లక్షలాది మంది సైనికులు, వేలాది మంది పౌరులు మరణించారు.

పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు కావడంతో పాటు భారీ నష్టం జరిగింది. అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యుద్ధం ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ మధ్య వర్తిత్వం చేపట్టినా, మధ్యలో పశ్చిమాసియా పరిణామాల కారణంగా ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి కనిపించలేదు.

దాదాపు 1,250 కిలోమీటర్ల ఫ్రంట్‌లైన్‌లో ఇరు దేశాల దళాలు పెద్దగా ముందడుగు వేయలేకపోతున్నాయి. ఈ పరిణామల మధ్య శాంతి కోసం మరో అంకం మొదలైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలను తాజాగా మరోసారి చేపట్టింది అమెరికా.

ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు తన బృందాన్ని పంపారు. ఇందులో అమెరకా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఉన్నారు. మాస్కోలో వీరికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాదర స్వాగతం పలికారు. వీరి మధ్య జరిగిన ప్రత్యేక సమావేశం ఆసక్తిగా సాగింది.

యుద్ధం ముగింపు దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని, రష్యా వైపు తమ వాదనను బలంగా వినిపిస్తామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. ఇలాంటి వేళ ఈ చర్చల ప్రక్రియలో నాయకత్వం వహించే వారిపై నమ్మకం, విశ్వాసం అత్యంత కీలకమైనవని పుతిన్ అన్నారు కాగా అమెరికా ప్రతినిధులు రష్యా వచ్చిన నేపథ్యంలో మూడురోజుల పాటు ఉక్రెయిన్‌పై ఎటువంటి దాడులు చేయవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తమ సైన్యాన్ని ఆదేశించారు.

వీరికి ఎలాంటి భద్రతా ముప్పు లేకుండా సురక్షితంగా పర్యటించేందుకు వీలుగా రష్యా- ఉక్రెయిన్ వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ తమకు విజ్ఞప్తి అందినట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాలు, విదేశాంగ శాఖల ద్వారా ఈ అభ్యర్థన అందిందన్నారు.. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ తాత్కాలికంగా దాడులను నిలిపివేశాయి.

సమయంలో ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న తరుణంలో ఇలాంటి దౌత్యపరమైన సంప్రదింపులు ప్రయోజనకరమేనని రష్యా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. సంక్షోభానికి తెరదించే దిశగా ట్రంప్ ప్రత్యేక రాయబారులతో పుతిన్ జరిపిన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది.

నూటికి నూరు శాతం విశ్వసనీయ వాతావరణంలో జరిగిందని వెల్లడించింది. అయితే వారిద్దరూ ఏ చర్చించారనేది బయటకు రాలేదు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమిత ప్రాంతాలు ఎవరి ఆధీనంలో ఉండాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తాను ఆక్రమించిన ప్రాంతాలపై పట్టు సడలించేది లేదని రష్యా స్పష్టం చేస్తోంది.

ఉక్రెయిన్ భవిష్యత్తులో నాటో కూటమిలో చేరకుండా తటస్థ వైఖరిని అవలంబించాలనేది రష్యా ప్రధాన డిమాండ్. ఉక్రెయిన్ భద్రతకు ఇది అతిపెద్ద సవాలుగా మారింది. భవిష్యత్తులో రష్యా నుంచి మళ్లీ దాడి జరగకుండా ఉక్రెయిన్‌కు అమెరికా, యూరప్ దేశాలు ఎలాంటి రక్షణ హామీలు ఇస్తాయనేది ముఖ్యమైన అంశం.

అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం రష్యా తరఫున మరో కీలక డిమాండ్‌. ఉక్రెయిన్‌కు సంబంధించిన సమస్యలపై రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేసినట్లు ఆయన ప్రత్యేక ప్రతినిధి యూరి ఉషాకోవ్ పేర్కొన్నారు.

రష్యా, అమెరికా దేశాధ్యక్షులు వ్యక్తిగత సంప్రదింపులను కొనసాగించాలని అంగీకారానికి వచ్చారని తెలిపారు తమ మాస్కో పర్యటనే ముగించుకున్న అమెరికా ప్రతినిధి బృందం కీవ్ వెళ్లింది. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వారికి సాదర స్వాగతం పలికారు.

జెలెన్‌స్కీతో స్టీవ్‌ విట్కాఫ్, జేర్డ్‌ కుష్నర్‌ విడతల్లో చర్చలు జరిపారు. అమెరికా రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో రష్యాపై వైమానిక దాడుల విషయంలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించడానికి ఉక్రెయిన్ సంసిద్ధత వ్యక్తం చేసిందని పుతిన్ కూడా ఇదే విధంగా వ్యవహరించాలని కోరారు జెలెన్‌స్కీ.

అయితే అమెరికా ప్రతినిధుల రాకకు ముందు రష్యా కీవ్‌, బోరిస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలపై దాడులు చేసిందని ఆరోపించారు. అమెరికా ప్రతినిధులు విమానంలో ఉక్రెయిన్‌కు చేరుకునే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ దాడులు జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదం సాగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు జెలెన్‌స్కీ. రష్యా ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ లేదా మరే ఇతర భూభాగాన్ని రష్యాకు వదులుకోవడానికి ఉక్రెయిన్ పూర్తిగా నిరాకరిస్తోంది.

తమ దేశ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయకుండా నిరోధించేలా భద్రతా హామీలు స్పష్టంగా, బలంగా ఉండాలని పట్టుబట్టారు.

ఉక్రెయిన్ ఆర్థిక పునరుద్ధరణకు, దేశ పునర్నిర్మాణానికి ఒక సమగ్ర 'ప్రాస్పరిటీ ప్లాన్' ఆర్థిక హామీలను అమెరికా బృందం ముందు ఉంచారు. రాబోయే శీతాకాలంలో కూడా యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నందున, రష్యా క్షిపణి దాడుల నుండి రక్షించుకోవడానికి అమెరికా, యూరప్ దేశాల నుండి మరింత సహాయం కొనసాగాలని జెలె‌న్‌స్కీ కోరారు.

కాగా ఇరు దేశాలతో చర్చల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా.. కీవ్‌తో పాటు పలు నగరాలపై రాత్రి మాత్రమే కాకుండా పగటి వేళల్లోనూ దాడులు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 4న రష్యా డ్రోన్‌ కీవ్‌లోని ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రధాన కార్యాలయాన్ని ఢీకొట్టింది. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా రష్యాలోని సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కేంద్రాలు, ఇతర కీలక ఆర్థిక మౌలిక వసతులపై డ్రోన్‌, క్షిపణి దాడులు చేసింది.

రష్యా యుద్ధ సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు యుద్ధ ప్రభావాన్ని అక్కడి ప్రజలకు తెలియజేయాలన్నది ఉక్రెయిన్‌ వ్యూహం. రష్యా రోస్టోవ్‌, వొరోనెజ్‌ ప్రాంతాల నుంచి బాలిస్టిక్‌ క్షిపణులను, డ్రోన్లను భారీగా ఉపయోగించించారు.

ఈ దశలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ట్రంప్ ప్రతినిధుల మాస్కో, కీవ్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇది చర్చలకు అనుకూల వాతావరణం కల్పిస్తుందా? ఇరు దేశాలు మళ్లీ చర్చల బాట పడతాయా? అన్నది వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story