Burning Topic: రాహుల్‌పై ఎస్సీ ఎస్టీ కేసు!

Burning Topic: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ శుద్ధీకరణ వివాదంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Sept 2026 6:40 AM IST
Burning Topic
X

Burning Topic: రాహుల్‌పై ఎస్సీ ఎస్టీ కేసు!

Burning Topic: హల్ద్వానీ శుద్దీకరణ వివాదం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కులాల మధ్య విద్వేషాన్ని పెంచడం, మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటి అభియోగాలపై భారతీయ న్యాయ సంహితలోని 196, 299 సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1) నిబంధనలను కూడా కేసులో చేర్చారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సభ్యుడు అమిత్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ మీద కేసు నమోదు చేశారు.

ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తమ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీశాయని అమిత్‌కుమార్‌ ఆరోపించారు. హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఆగస్టు 8న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు.

అయితే ఆగస్టు 11న అదే ప్రదేశంలో కొందరు ‘శుద్ధి యజ్ఞం’ నిర్వహించడంతో వివాదం మొదలైంది. ఈ ఘటనను బీజేపీ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనంగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ శుద్దీకరణను మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఖర్గేకు న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఖర్గే తన జీవితమంతా దేశం, రాజ్యాంగం కోసం అంకితం చేశారని, ఆయన బహిరంగసభ వేదికను శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసేలా ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే రాంలీలా మైదానంలో ఖర్గే సభ తర్వాత ప్రదేశం చెత్తతో నిండిపోయిందని అందుకు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి హవనం చేశామని శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నవారు సమర్ధించుకున్నారు మతపరమైన ప్రదేశంలో అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపించారు.

కాగా రాహుల్ గాంధీ మీద కేసు దాఖలు చేసిన అమిత్ కుమార్ శ్రీరామ్‌ సేన ధర్మార్థ సేవా న్యాస్‌ సభ్యుడిగా ఉన్నారు. తాను స్వయంగా శుద్ధి కార్యక్రమంలో తాను పాల్గొన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని, ఖర్గే కులానికి, ఈ ఆచారానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

కానీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వాల్మీకి సామాజిక వర్గ భావాలను తీవ్రంగా గాయపరిచాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారిని అస్పృశ్యత పాటించేవారిగా దళిత వ్యతిరేకులుగా రాహుల్ చిత్రీకరించారని ఆరోపించారు

కాగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాజంలో కుల విభజన తెచ్చేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో ఎలాంటి కుల వివక్ష, అంటరానితనం కోణం లేదని స్పష్టం చేశారు.

ర్యాలీ జరిగిన వేదికపై చెత్తాచెదారం వేయడం వల్ల, అలాగే పక్కనే రామాలయం ఉండటం వల్ల ఆ సంస్థ నిర్వాహకులు కేవలం 'పరిశుభ్రత' కోసమే పూజలు నిర్వహించారని పేర్కొంది. హల్ద్వానీలో శుద్ధీకరణ పూజలు లేదా హవనం నిర్వహించిన 'శ్రీరామసేన ధర్మార్థ సేవా న్యాస్' సంస్థ సభ్యులకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ తీరును బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సే్న్ తప్పుపట్టారు. ఆయన సమాజంలో విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు కాగా రాహుల్​ గాంధీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడంపై కాంగ్రెస్​ తీవ్రంగా ఖండించింది.

ఆ పార్టీ నాయకులు డెహరాడూన్ పోలీస్టేషన్‌‌లో తమ నిరసన తెలియజేశారు. బీజేపీ కులతత్వ భావజాలంపై పూర్తి శక్తితో పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటామని పేర్కొంది.

ఖర్గే సభ అనంతరం వేదికను శుద్ధీకరణ చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు, కానీ ఆ కులతత్వ చర్యకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు అని ఆరోపించింది.

కేసుల భయంతో రాహుల్ గాంధీ గానీ, కాంగ్రెస్ గానీ వెనక్కి తగ్గుతామన్న భ్రమను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తొలగించుకోవాలని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. వారి దళిత, రాజ్యాంగ వ్యతిరేక' మనస్తత్వానికి ఇది ఉదాహరణ అని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story