Off The Record: ‘నేను గోరంట్లలో లోకల్!’.. ఎమ్మెల్యేకు సీనియర్ నేత కౌంటర్!

Off The Record: ఏపీలోని ప్రత్తిపాడులో కూటమి నేతల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టీడీపీ నేత హరిబాబు మధ్య చెరువు నీటి వివాదం రగడ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2026 9:37 AM IST
Off The Record
X

Off The Record: ‘నేను గోరంట్లలో లోకల్!’.. ఎమ్మెల్యేకు సీనియర్ నేత కౌంటర్!

Off The Record: ఏపీలో కూటమి నేతల మధ్య పంచాయితీ తారా స్థాయికి చేరింది. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతున్న వేళ కూటమి పార్టీల్లో రగడ చర్చనీయాంశంగా మారింది. జిల్లా స్థాయి నేత.. ఎమ్మెల్యే పరస్పరం సై అంటే సై అంటున్నారు.

గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ జిల్లా చైర్మన్ వడ్రాణం హరిబాబుపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపికైంది. గుంటూరు కార్పోరేషన్ పరిధిలోని గోరంట్ల ప్రాంతంలో వడ్రాణం హరిబాబు నివాసం ఉంటున్నారు.

టిడిపిలో సీనియర్ నేతగా ఉన్న వడ్రాణం హరిబాబుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ పదవి దక్కింది. కాగా.. ఇటీవల తాను నివాసం ఉండే గోరంట్ల ప్రాంతంలోని చెరువు నీటిని వైసిపి నేతలు అక్రమంగా తరలించి వాటిని నగరంలో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారట.

అయితే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో చెరువులో నీరు తగ్గిపోయింది. వైసిపికి చెందిన కొంతమంది ఈ చెరువులో బోర్లు వేసి నీటిని తోడి అక్రమంగా వాటిని అమ్ముకోని సొమ్ము చేసుకుంటున్నారట. అయితే ఇన్నాళ్లు చూస్తూ ఊరుకున్న గోరంట్ల ప్రజలు..

ఈ యేడాది వర్షాలు లేకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటాయిని, ఇలాంటి సమయంలో చెరువు వద్ద బోర్ల ద్వారా నీటిని తోడటం నిలిపివేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. అధికారులకు విన్నవించినా.. సమస్యకు పరిష్కారం లభించడకపోవడంతో వడ్రాణం హరిబాబును ఆశ్రయించారు. చెరువులో నీటిని కాపాడాలని మొరపెట్టుకున్నారు.

వాస్తవ పరిస్థితి తెలుసుకున్న వడ్రాణం హరిబాబు నేరుగా చెరువు వద్దకు వెళ్లి నీటిని అక్రమంగా తరలిస్తున్న ట్యాంకర్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి నిలదీశారు. ఫలితంగా ఆ ఒక్క రోజు మాత్రం నీటి తరలింపు ఆగిపోయింది.

మరుసటి రోజు నుంచి యధావిధిగా అక్రమంగా చెరువునీటిని తరలించారు. ఈ క్రమంలో చెరువునీటిని తరలిస్తున్న అక్రమార్కులు స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును ఆశ్రయించి.. అధికారులకు అండదండలు పొందినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే బూర్లతోనే అసలు సమస్యను చెప్పుకునేందుకు స్థానికులు హరిబాబు వెంట తీసుకుని వెళ్లారు.

వడ్రాణం హరిబాబును చూసిన ఎమ్మెల్యే బూర్ల.. ఆగ్రహంతో ఊగిపోయారట. నీకు నా నియోజకవర్గం ఏం పని..? నీ హడవుడి తగ్గించుకో అని.. అన్నారట. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వద్ద పరపతి ఉంటే ఉండొచ్చు గానీ.. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటనీ మండిపడ్డారట ఎమ్మెల్యే.

అంతటితో ఆగలేదట ఎమ్మెల్యే బూర్ల. నీవు ఏదైనా ఉంటే ఎంపీ ఆఫీస్‌కు ఫోన్ చేయడం, ఎంపీ ఆఫీస్ సిబ్బంది అధికారులకు ఫోన్లు చేస్తుంటే ఇక ఎమ్మెల్యేగా నేనెందుకు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే మాటలకు కోపోద్రిక్తుడైన హరిబాబు.. తన జేబులో ఆధార్ కార్డు ఎమ్మెల్యేకు ఇచ్చి..

తన ఇల్లు గోరంట్లలో ఉంది, తన ఓటు కూడా గోరంట్లలోనే ఉందంటూ చెప్పారట. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గోరంట్ల ప్రాంతంలో ప్రచారం చేయలేదా అని నిలదీశారట. పైగా నాకు కేంద్ర మంత్రి పెమ్మసాని వద్ద కాదు టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వద్ద కూడా పరపతి ఉందని, పార్టీ అధిష్టానం వద్దే తేల్చుకుంటానని హరిబాబు హెచ్చరించారట.

బూర్ల తీరుతో హరిబాబు వెంట వచ్చిన వాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే కార్యాలయంలో గందరగోళం నెలకొందట. ఇంతకీ హరిబాబును గోరంట్లలో ఏం పని అడిగే ఎమ్మెల్యే బూర్ల ఎక్కడో కర్నూలు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎలా పోటీ చేస్తారని స్థానికులు నిలదీస్తున్నారు.

రామాంజనేయులు, హరిబాబు మధ్య మధ్య జరిగిన మాటల యుద్ధం.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందట. ఈ అంశాన్ని కేంద్రమంత్రి పెమ్మసానితోపాటు టిడిపి అధిష్టానం వద్దకు కూడా తీసుకువెళ్ళాలని హరిబాబు భావిస్తున్నారట. మరి ప్రత్తిపాడు నియోజకవర్గం కూటమి నేతల్లో ఆధిపత్య పోరును పార్టీ పెద్దలు ఏవిధంగా పరిష్కరిస్తారో..? చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story