Off The Record: ఈ దెబ్బతో తెలంగాణలో కవిత సీఎం అవుతుందా?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ రీ-ఎంట్రీ! కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన'కు పీకే వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 6:48 AM IST
Off The Record
X

Off The Record: ఈ దెబ్బతో తెలంగాణలో కవిత సీఎం అవుతుందా?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాల్లో పీకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్న పీకే.. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పార్టీకి పొలిటికల్ అడ్వైజర్‌గా వ్యవహరించనున్నట్లు పక్కా సమాచారం. ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినేత్రి కవితతో ప్రశాంత్ కిషోర్ రెండుసార్లు భేటీ అయ్యారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి పీకే తన ఐ-ప్యాక్ టీంతో కలిసి కాకుండా, కేవలం వ్యక్తిగత స్థాయిలో సలహాలు, సూచనలు అందించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఇక వచ్చే అక్టోబర్ నుంచి ప్రశాంత్ కిషోర్ తన పని ప్రారంభించనున్నారట. కవిత తన సోషల్ మీడియా టీంకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, పీకే రాకతో ఆ వేగం మరింత పెరగనుందట. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో, సోషల్ మీడియాలో ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో పీకే తనదైన ముద్ర వేయనున్నారట. రాబోయే రోజుల్లో కవిత కోసం ఐ-ప్యాక్ టీం కూడా పని చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడనున్నాయన్న చర్చ ఊపందుకుంది.

ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో పని చేయాలని ఆసక్తిగా ఉన్నారట. గతంలో బిహార్ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వస్తానని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం కవిత కొత్త పార్టీకి వ్యూహకర్త అవసరం కాబట్టి.. ప్రశాంత్ కిషోర్‌తో డీల్ కుదుర్చుకొని అడుగులు వేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ 25న జరిగిన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పీకే డిజైన్ అని చెబుతున్నారు. అక్కడ స్టేజీకి రెండు వైపులా కూడా కవిత మాట్లాడటానికి పోడియం ఉంచారు. మధ్యలో ర్యాంప్ వేసి దానిపై నడుచుకుంటూ ముందుకు వచ్చి అక్కడే నిల్చొని మాట్లాడటం ద్వారా ఒక్కరే ఫోకస్ అవుతారని, అదొక స్ట్రాటజీగానే చేశారన్న చర్చ లేకపోలేదు. ఈ ప్లాన్ పీకే రచనలో భాగమేనట. అలాగే పార్టీలోకి యువతను ఆకర్షించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై నిత్యం ప్రశ్నిస్తే ఫోకస్ అవుతారని సూచించారట. అదే విధంగా పార్టీ ప్రకటన రోజు మాజీ ముఖ్యమంత్రి, తండ్రి కేసీఆర్‌ను కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసీఆర్‌ను తండ్రిగా ఎక్కడా విమర్శించలేదని, కేవలం బీఆర్‌ఎస్ అధినేతగా ఆయన వైఫల్యాలను మాత్రమే నిలదీశాననీ కవిత క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ క్లారిటీ కూడా పీకే స్ట్రాటజీలో భాగమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరిని తిడితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు..? ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది.. కూడా వ్యూహకర్త స్కెచ్‌లో భాగమేనంటున్నారు.

సంక్రాంతి పండగ సమయంలో మొదటిసారి కల్వకుంట్ల కవితను పీకే కలిసినట్టు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత మరోసారి కవితతో పీకే చర్చలు జరిపారట. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ ప్రకటించడం, రాజకీయ విమర్శలు.. ప్రతివిమర్శలు అందరికీ తెలిసిందే. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలన్నీ.. అతి త్వరలోనే పీకే ఈ రాష్ట్రంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనడానికి సంకేతాలట. నిజంగా పీకే కోరుకుంటున్నట్టు తెలంగాణలో ఎంట్రీ అయ్యాక.. ఇంకా ఎటువంటి వ్యూహాలు రచిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ కవితకు పీకే వ్యూహకర్తగానే ఉంటారా..? ఐప్యాక్ టీం ప్రత్యేకంగా పని చేస్తుందా..? అన్నది చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story