Off The Record: దీదీని మట్టికరిపించిన వ్యూహం తెలంగాణలో పారుతుందా? మోదీ టూర్‌పై ఉత్కంఠ!
Off The Record: పశ్చిమ బెంగాల్ విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు.
Off The Record: దీదీని మట్టికరిపించిన వ్యూహం తెలంగాణలో పారుతుందా? మోదీ టూర్‌పై ఉత్కంఠ!
Off The Record: తూర్పున విరబూసిన కమలం.. దక్షిణాది గడ్డపై పాగా వేయాలనే తీవ్ర ప్రయత్నాలకు పదును పెట్టింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని మట్టి కరిపించి, 15 ఏళ్ల తృణమూల్ పాలనకు చరమగీతం పాడేసింది బీజేపీ. అదే విధంగా అస్సాంలో హ్యాట్రిక్ విజయం, పుదుచ్ఛేరిలో ఎన్డీయే కూటమి జోష్‌ను తెలంగాణలో సైతం చూపించాలని అధిష్టానం ప్లాన్ చేస్తోందట. బెంగాల్ సంచలన ఫలితాలతో.. తెలంగాణ బీజేపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ గెలిచి చూపించాం.. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు..? కచ్చితంగా అవుతుంది.. అన్న ధైర్యం కార్యకర్తల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ బీజేపీ మీటింగ్స్ పెరుగుతున్నాయి. స్థానిక నాయకులు కూడా మరింత యాక్టివ్ అవుతున్నారు. దీదీపై అక్కడి కార్యకర్తల పోరాటాన్ని మోడల్‌గా తీసుకుని.. తెలంగాణలో అధికార పార్టీపై రాజకీయ పోరాటం చేయాలన్న స్ట్రాటజీ రెడీ చేసుకుంటోంది బీజేపీ అధినాయకత్వం. ఆ మూడు రాష్ట్రాల గెలుపు మంత్రాన్ని తెలంగాణలో సైతం అమలు చేయాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా తెలంగాణ బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కార్పోరేషన్ల మేయర్ పీఠాల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు మే 10న తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే రోజు కావొచ్చన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. అందుకు కారణం లేకపోలేదు... ఆ పార్టీ అగ్రనాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో బహిరంగ సభకు తరలివస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలిచి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ రాక రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. ఇది సాధారణ పర్యటన కాదు.. రాబోయే ఎన్నికల యుద్ధానికి ఓ బలమైన సంకేతమంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఒకవైపు అభివృద్ధి మంత్రం మరొకవైపు ఇటీవల కేసీఆర్, రేవంత్ రెడ్డిల బహిరంగ సభలకు ధీటుగా రాజకీయ డైలాగ్స్ పేలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చే అవకాశం కూడా లేకపోలేదు. గ్రామీణ, మండల ప్రాంతాల్లో కూడా మోదీ మీటింగ్‌పై భారీ అంచనాలు ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ వస్తే ఏదో మార్పు వస్తుందన్న జోష్ కమల దళం శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే మోదీ టూర్.. పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందా..?అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.
మరోవైపు కేరళలో కాంగ్రెస్ జోరు కూడా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇస్తుందా..? అన్నది కీలక అంశంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కారు.. కమలం.. హస్తం.. ఇలా త్రిముఖ పోరులో తెలంగాణ ఓటరు ఎవరిని ఎంచుకుంటాడోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎవరు అభివృద్ధి చేస్తే వారికే మా ఓటు అంటున్న మాట గ్రామీణ ఓటర్లలో వినిపడుతోంది. అయితే తెలంగాణలో రాజకీయంగా చూస్తే ఉద్యమ నేపథ్యం, కులాలు, ప్రాంతాలు, నాయకుల ప్రభావం కూడా కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు బెంగాల్‌లో గెలిచిన జోష్. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ వెరసి.. ఇక్కడి బీజేపీ నాయకుల్లో ఉత్సాహం రెట్టింపైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే కాంగ్రెస్‌కు కేరళ హస్తగతం.. ఇవన్నీ కలిసి తెలంగాణలో కొత్త రాజకీ సమీకరణాలకు దారి తీస్తాయా..? లేక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలే చివరికి ఫలితాన్ని డిసైడ్ చేస్తాయా..? అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ... బెంగాల్ బూస్ట్, మోదీ టూర్ ఇవన్నీ కలిసి తెలంగాణలో కొత్త రాజకీయ చరిత్ర రాస్తాయా..? లేక పాత సమీకరణాలే మళ్లీ గెలుస్తాయా..? బెంగాల్ జోష్‌తో మోదీ ఏం మాట్లాడుతారు? ఎవర్ని టార్గెట్ చేస్తారోనన్న ఆసక్తి రేపుతోంది.. చూడాలి మరి తెలంగాణ బీజేపీ ఏం జరుగుతుందో..!




