Burning Topic: న్యూజీలాండ్‌తో భారత్ చారిత్రక ఒప్పందం
Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.
Burning Topic: న్యూజీలాండ్‌తో భారత్ చారిత్రక ఒప్పందం
Burning Topic: భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని సుమారు రూ.35 వేల కోట్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
పెట్టుబడులు, సాంకేతికత, వ్యవసాయం, విద్య, ఆవిష్కరణలు, సేవల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. న్యూజిలాంగ్‌ను అవకాశాల నేలగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఇరుదేశాల అద్భుత ప్రయాణానికి న్యూజిలాండ్ నలుమూలలా విస్తరించిన భారతీయులే అసలేన నావికులని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటనలో చివరి దశగా న్యూజిలాండ్ చేరుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. న్యూజిలాండ్ ఆర్థిక రాజధాని అయిన ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్, మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఆక్లాండ్ గవర్నమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీకి మావోరి సంప్రదాయ హకా నృత్యంతో అధికారిక స్వాగతం లభించింది. ఇది న్యూజిలాండ్ ఆదివాసీలైన మావోరి తెగ సాంప్రదాయ ఆహ్వాన ఆచారం. ఈ వేడుక ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించింది.
ఆక్లాండ్‌లో భారత ప్రధాని మోదీ. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్ల దృష్ట్యా సముద్ర భద్రత రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్, న్యూజిలాండ్ నిర్ణయించాయి. దీనికోసం ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఏర్పాటు చేయాలని అంగీకరించాయి. ఈ వేదిక ద్వారా సమాచార మార్పిడి, సమన్వయం, సంయుక్త చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అలాగే పరస్పర లాజిస్టిక్ సహకార ఒప్పందం ద్వారా ఇరు దేశాల నౌకాదళాల మధ్య కార్యాచరణ సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే, అభివృద్ధి చెందే ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ప్రతి దేశం సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్జాతీయ నిబంధనల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత అవసరమని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
రాబోయే నాలుగేళ్లలో రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్‌మ్యాప్ 2030ని ఆవిష్కరించారు. 2030 నాటికి వస్తువులు, సేవల రంగాల్లో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు రూ.35 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అలాగే రాబోయే 15 ఏళ్ల పాటు భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ హామీ ఇచ్చింది. ఈ భేటీలో 10 ఒప్పందాలతో సహా మొత్తం 18 కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. లక్సాన్ ఈ సందర్శనను "కొత్త అధ్యాయం"గా అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆక్లాండ్‌లో జరిగిన వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు ఇరుపక్షాల నుంచి అపార మద్దతు లభిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇరుదేశాల ఉమ్మడి సహకారంతో అద్భుత ప్రయాణం సాగుతోందన్నారు. ఆక్లాండ్‌లో ప్రవాసుల కోసం నిర్వహించిన 'కియా ఓరా మోదీ' కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు. న్యూజిలాండ్ నలుమూలలా భారతీయులు విస్తరించి ఉన్నారని గుర్తు చేశారు.
భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. అపారమైన సంకల్ప బలానికి ప్రతీకైన నీలి ఆకాశం మనతో ఉంది. మనం సాధించడానికి ఇంకా ఎంతో ఉంది. ఈ ప్రయాణంలో మనం తప్పక విజయం సాధిస్తామని తెలుసు అన్నారు మోదీ.
పాతికేళ్ల క్రితం ఓ న్యూజిలాండ్ మిత్రుడు తనకు మఫ్లర్, టోపీ, చేతి తొడుగులు బహుమతిగా ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. ఆ మఫ్లర్‌ను ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నానని అక్కడి ప్రవాస భారతీయులకు చూపించారు. మఫ్లర్‌ను ఎంత ప్రేమగా కాపాడుకున్నానో, మీ అందరి అభిమానాన్ని కూడా అంతే విలువగా భావిస్తున్నాను అని తెలిపారు.
ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పలు కీలక రంగాల్లో అపూర్వమైన అవకాశాలను అందిస్తుందని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా భారత్ అభివృద్ధి మాత్రం నిరంతరంగా కొనసాగుతోందన్నారు ప్రధాని మోదీ. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
ప్రతి నెల యూపీఐ ద్వారా కోట్లాది డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా డ్రోన్ సాంకేతికత, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని తెలిపారు.




