Minorities in Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీల ఆర్తనాదాలు.. ఏటా వేయి మంది బాలికల అపహరణ, బలవంతపు మతమార్పిడులు!

Minorities in Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితి దారుణంగా మారింది. ఏటా వెయ్యి మందికి పైగా హిందూ, క్రైస్తవ బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, పెళ్లిళ్లు చేస్తున్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి పాకిస్థాన్‌ను హెచ్చరించింది.

Arun Chilukuri
Published on: 30 April 2026 7:30 AM IST
Minorities in Pakistan
X

Minorities in Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీల ఆర్తనాదాలు.. ఏటా వేయి మంది బాలికల అపహరణ, బలవంతపు మతమార్పిడులు!

Minorities in Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. 2023 అధికారిక గణాంకాల ప్రకారం అక్కడి జనాభాలో మైనారిటీలు సుమారు 3-4% వరకు ఉన్నారు ఇందులో హిందువులది 39 లక్షలతో అతిపెద్ద మైనారిటీ వర్గం.. క్రిస్టియన్లు 33 లక్షలు. అహ్మదీయలు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులు తర్వాతి స్థానంలో ఉన్నారు 1947 విభజన సమయంలో 20% కంటే ఎక్కువగా ఉన్న హిందూ జనాభా 1.61% కి పడిపోయింది. హింస, వలసలు. బలవంతపు మత మార్పిడులు ఇందుకు కారణం. పాకిస్థాన్ హిందువుల్లో ఎక్కువగా సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వీరి ప్రాణాలకు, మత విశ్వాసాలకు రక్షణ లేకుండా పోతోంది. బలవంతపు మతమార్పిడులు, దైవదూషణ చట్టాల దుర్వినియోగంతో పాటు పలు రకాల వివక్షను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మైనారిటీ హిందూ మహిళలు, బాలికల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

పాకిస్థాన్‌లో ముస్లిమేతర బాలికలను కిడ్నాప్ చేసి ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లిళ్లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. బలవంతపు మతమార్పిడి బాధితుల్లో హిందూ, క్రైస్తవ వర్గాలకు చెందిన బాలికలే ఎక్కువ. పాకిస్థాన్‌లో హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు అపహరణకు గురవుతున్నారు. ఆ దేశంలో బలవంతపు మతమార్పిడులకు గురవుతున్న వారిలో అత్యధికం హిందూ, క్రైస్తవ మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. తాజా ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించి నివేదిక కలకలం రేపుతోంది. 2025లో బలవంతపు మతమార్పిడి వివాహాలకు గురైన బాధితుల్లో 75 % మంది హిందువులు ఉండగా 25 % మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం నమోదైన కేసుల్లో 80 % ఘటనలు ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే జరిగాయి. ముఖ్యంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న, అంతకంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి.

పాకిస్థాన్‌లో హిందూ బాలికలపై అకృత్యాలను వెంటనే అరికట్టాలని ఆక్కడి ప్రభుత్వాకి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. బలవంతపు మతమార్పిడిని ఒక ప్రత్యేక నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకురావాలని, దేశవ్యాప్తంగా అన్ని ప్రావిన్సుల్లో వివాహ కనీస వయసును 18 ఏళ్లకు పెంచాలని సూచించారు. మానవ అక్రమ రవాణా, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టించుకోకపోవడం, విచారణలో జాప్యం చేయడం, బాధితుల వయసును నిర్ధారించడంలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం వంటి చర్యలను సమితి తీవ్రంగా తప్పుబట్టింది. మైనారిటీ బాలికలకు సురక్షిత ఆశ్రయాలు, ఉచిత న్యాయ సహాయం, మానసిక కౌన్సెలింగ్ వంటి సహాయక సేవలు అందించాలని పాకిస్థాన్‌కు సూచింది

పాకిస్థాన్‌లో ఏటా సుమారు 1000 మంది హిందూ, క్రైస్తవ బాలికలు అపహరణకు గురై ఇస్లాంలోకి మార్చబడుతున్నారు. వారి వయస్సు కంటే రెట్టింపు వయస్సు ఉన్న పురుషులతో బలవంతంగా వివాహం చేయడం, అత్యాచారం చేయడం, మానవ అక్రమ రవాణా ముఠాలకు అమ్మడం, వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టడం జరుగుతోంది. 2004 నుండి 2018 మధ్య, ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే 7430 హిందూ బాలికల అపహరణ కేసులు నమోదయ్యాయి, అయితే వాస్తవ కేసుల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో మైనర్ మైనారిటీ బాలికలను అపహరణలు, బలవంతపు మత మార్పిడులు మరియు వివాహాల నుండి రక్షించే చట్టాలు లేవు. కొన్ని ఇస్లామిక్ సెమినరీలు సంస్థలు బలవంతంగా మత మార్పిడులు చేయడం, వివాహం చేసుకోవడం మత పరమైన విధిగా బోధిస్తున్నాయని హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక చెబుతోంది.

పాకిస్థాన్ రాజ్యాంగంలోని 20-22 అధికరణలు పౌరులందరికీ మత స్వేచ్ఛకు హామీ ఇస్తాయి. అయితే 1977లో ప్రవేశపెట్టబడిన ఇస్లామిక్ చట్టం , ముస్లిమేతరులకు సమాన రక్షణ, మత స్వేచ్ఛను నిరాకరించే నిబంధనలను విధించింది. పాకిస్తాన్ శిక్షాస్మృతిలో దైవదూషణ చట్టాలు , ప్రవక్త మహమ్మద్‌ను అవమానించినట్లుగా భావించినా లేదా ఖురాన్‌ను అపవిత్రం చేసినా కఠినమైన శిక్షలను విధిస్తాయి. అంతేకాకుండా అహ్మదీయులు ఇస్లామిక్ పరిభాషను, చిహ్నాలను ఉపయోగించడాన్ని మరియు "తమ విశ్వాసాన్ని బోధించడాన్ని లేదా ముస్లింలుగా నటించడాన్ని నిషేధిస్తాయి. మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా, యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష వరకు ఉంటాయి. పాకిస్థాన్ అనేక తీవ్రవాద, ఉగ్రవాద సమూహాలకు నిలయం., ఇవి దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తూ ఇస్లామిక్ పాలనను, హింసాత్మక జిహాద్‌ను మరియు ముస్లిమేతరుల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story