Off The Record: మేయర్ పీఠం కోసం ఒక్కటైన కాపులు!

Off The Record: ఒంగోలు మేయర్ సీటును కాపు సామాజికవర్గానికే కేటాయించాలని పార్టీలకు అతీతంగా నేతల డిమాండ్. నగర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2026 7:57 AM IST
Off The Record
X

Off The Record: మేయర్ పీఠం కోసం ఒక్కటైన కాపులు!

Off The Record: ఒంగోలు మేయర్ సీటుపై కాపు నాయకులు కన్నేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న కాపు నేతలు తమతమ పార్టీల పరిధిలో టికెట్ కోసం ప్రయత్నించడం సహజమే. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. విడివిడిగా టికెట్ అడగడం కంటే సామాజికవర్గం తరుపునే మేయర్ సీటును డిమాండ్ చేయాలనే ఆలోచనతో కాపు నాయకులు ముందుకు వస్తున్నారట. అంటే.. పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. కానీ మేయర్ సీటు విషయంలో మాత్రం ఒకే డిమాండ్‌తో ముందుకు వెళ్లాలనే వ్యూహంతో కాపు నాయకులు ఉన్నారట.

మేయర్ పీఠం కోసం పార్టీలకు అతీతంగా కాపు నాయకులు సమావేశమయ్యారన్న విషయం ప్రస్తుతం ఒంగులులో రీసౌండ్ చేస్తోంది. ఏ పార్టీపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి..? అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలా ముందుకెళ్లాలి..? అనే అంశాలపై చర్చించారట. ఫలితంగా మేయర్ సీటు కోసం సామాజికవర్గాల లెక్కలు కూడా తెరపైకి వస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సమావేశం పార్టీలను కదిలించేంత బలమైన రాజకీయ సందేశాన్ని ఇవ్వగలిగిందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

కాపు నాయకుల డిమాండ్ ఒక ఎత్తు.. రాజకీయ పార్టీలు అంగీకరించడం మరో ఎత్తు. ఎందుకంటే మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు పార్టీలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నగరంలో పార్టీకి ఉన్న బలం ఎంత..? అభ్యర్థికి వ్యక్తిగతంగా ఉన్న బలం ఎంత..? పార్టీ కేడర్‌ను ఏ మేరకు సమన్వయం చేయగలరు..? ఇతర సామాజిక వర్గాలను ఎంతవరకు కలుపుకుపోగలరు..? అన్న అంశాలన్నీ కీలకం. కాబట్టి కాపు సామాజిక వర్గం నుంచి డిమాండ్ వచ్చినంత మాత్రాన పార్టీలు వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యతను పార్టీలు పరిగణనలోకి తీసుకోకుండా ఉండగలవా అన్నది కూడా మరో ప్రశ్న. ఈ రెండు లెక్కల మధ్యే మేయర్ టికెట్‌పై అసలు గేమ్ నడిచే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని మేయర్ రేసులోకి దింపితే ఆ నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాపు ఓటర్ల మద్దతు ఉన్నప్పటికీ.. మిగిలిన సామాజికవర్గాల మద్దతును కూడా కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, అన్ని వర్గాలతో ఉన్న సంబంధాలు, పార్టీ కేడర్ బలం, స్థానిక రాజకీయ పరిచయాలు, ఎన్నికల సమయంలో పార్టీ యంత్రాంగం చేసే సమన్వయం.. ఈ ఈక్వేషన్స్‌ అన్నీ కలిసినప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. అందుకే కాపు అభ్యర్థికి టికెట్ రావడం ఒక విజయంగా భావించినా ఆ అభ్యర్థిని గెలిపించడమే అసలు సవాల్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాపు అభ్యర్థి వెనుక ఆ పార్టీలోని మిగతా కాపు నాయకులు ఎంతవరకు నిలబడతారన్నదే అసలు ట్విస్ట్..! టికెట్ తమకు రాకపోయినా ‘మన సామాజిక వర్గం అభ్యర్థి’ అంటూ భుజం కలుపుతారా..? లేక ‘పార్టీ నిర్ణయం గౌరవిస్తున్నాం’ అని చెప్పి ఎన్నికల వరకు తమ లెక్కలు తాము చూసుకుంటారా..? ఎందుకంటే టికెట్ కోసం ఐక్యత ఒక లెక్క టికెట్ వచ్చిన తర్వాత అభ్యర్థి గెలుపు కోసం ఐక్యత మరో లెక్క! మేయర్ టికెట్ కోసం ఇప్పటికే పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. అలాంటి సమయంలో ఒకే ఒక్క నాయకుడికి టికెట్ దక్కితే... మిగిలిన ఆశావహులు పార్టీ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా..? లేక అసంతృప్తి రాజకీయంగా ప్రభావం చూపుతుందా..? బయటకు పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నట్టు కనిపించినా లోలోపల పరిస్థితి మరోలా ఉండే ఛాన్స్ లేకపోలేదు.

కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రాజకీయ పార్టీలు పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే మిగిలిన వర్గాలు ఆ అభ్యర్థిని ఏ మేరకు స్వీకరిస్తాయన్నది చూడాలి. ఒకవేళ రాజకీయ పార్టీలు కాపు నాయకుల డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకుని మేయర్ సీటును ఆ సామాజిక వర్గానికి కేటాయిస్తే... అది ఒంగోలు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ కాపు నాయకుల డిమాండ్‌ను పక్కనపెట్టి మరో అభ్యర్థిని ఎంపిక చేస్తే అప్పుడు కాపు నాయకుల తదుపరి కార్యాచరణ ఏంటనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story