మారేడుమిల్లి అడవుల్లో 'స్వయంభు' టీమ్‌కు భయానక అనుభవం: రెండు రోజులు కొండపైనే చిక్కుకున్న సిబ్బంది!
Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తున్న 'స్వయంభు' సినిమా షూటింగ్లో ఎదురైన సవాళ్లను దర్శకుడు భరత్ కృష్ణమాచారి వివరించారు.
మారేడుమిల్లి అడవుల్లో 'స్వయంభు' టీమ్‌కు భయానక అనుభవం: రెండు రోజులు కొండపైనే చిక్కుకున్న సిబ్బంది!
Swayambhu: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'స్వయంభు'. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటనను దర్శకుడు భరత్ తాజాగా మీడియా సమావేశంలో పంచుకున్నారు.
సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం రాజమండ్రికి సమీపంలోని మారేడుమిల్లి అడవులను ఎంచుకున్నట్లు దర్శకుడు తెలిపారు. "మేము షూటింగ్ కోసం ఇంతకుముందు ఎవరూ వెళ్ళని అత్యంత దట్టమైన ప్రాంతాలను ఎంచుకున్నాం. అక్కడికి చేరుకోవడానికే జీపుల్లో రెండున్నర గంటలు పట్టేది. ఒక షెడ్యూల్ సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో మా సిబ్బందిలో కొందరు ఒకటి రెండు రోజులు కొండపైనే చిక్కుకుపోయారు. కిందికి వచ్చే మార్గం లేక, కనీస సామాగ్రి కూడా లేక వారు పడ్డ కష్టాలు వర్ణనాతీతం" అని భరత్ ఆ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు సాంకేతికంగా భారీ వ్యయం చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో 8 ఎకరాల విస్తీర్ణంలో 45 రోజుల పాటు శ్రమించి ఒక పూర్తిస్థాయి గ్రామం సెట్‌ను నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోలో క్లైమాక్స్ చిత్రీకరణ కోసం రెండు భారీ వంతెనల సెట్లు వేశారు. అందులో 100 అడుగుల పొడవున్న ఒక వంతెనను కేవలం కూల్చివేత సన్నివేశం కోసమే ప్రత్యేకంగా తయారు చేయడం గమనార్హం. క్లైమాక్స్ సన్నివేశాలను దాదాపు 80 రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'కార్తికేయ-2' తర్వాత నిఖిల్ నటిస్తున్న మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో 'స్వయంభు'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




