Burning Topic: ఉక్రెయిన్‌ పర్యటనలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు!

Burning Topic: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. శాంతి చర్చల ప్రాధాన్యతను తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2026 8:37 AM IST
Burning Topic
X

Burning Topic: ఉక్రెయిన్‌ పర్యటనలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు!

Burning Topic: గత నాలుగున్నరేళ్లుగా రష్యా కొనసాగిస్తున్న యుద్ధం కారణంగా అష్ట కష్టాలు పడుతున్న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌ను సందర్శించారు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌. కీవ్‌పై రెండు రోజుల క్రితం రష్యా కురిపించిన బాంబుల వర్షంలో ఒక భారతీయునితో సహా 12 మంది మృతి చెందారు.

ఈ పరిస్థితుల్లో జైశంకర్‌ కీవ్‌లో పర్యటించడాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిమా ప్రశంసించారు. మాపై రష్యా దాడులు తీవ్రమవుతున్న సమయంలో కీవ్‌ నగరాన్ని సందర్శించేందుకు జైశంకర్‌ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని తెలిపారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు జైశంకర్. భారత్‌-ఉక్రెయిన్‌ మధ్య వాణిజ్యం ప్రస్తుతం 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు, పునర్నిర్మాణంలో భారత కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని ఉక్రెయిన్‌ భావిస్తోంది.

ఇంధనం, మౌలిక వసతులు, రవాణా, వ్యవసాయం, ఔషధాలు, డిజిటలైజేషన్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో సహకారానికి అవకాశాలున్నాయి. భారత్‌-ఉక్రెయిన్‌ సంబంధాల బలోపేతంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై ఇరువురూ చర్చించారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంతో పాటు యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై చర్చించారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై జైశంకర్‌ మరోసారి భారత్‌ వైఖరిని స్పష్టం చేశారు. 'ఇది యుద్ధాల యుగం కాదు' అన్న ప్రధాని మోదీ సందేశాన్ని గుర్తు చేశారు.

యుద్ధభూమి నుంచి పరిష్కారాలు రావని, చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని అన్నారు. యుద్ధం కొనసాగుతున్నన్ని రోజులు ప్రాణనష్టం, విధ్వంసం జరుగుతోందని జైశంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రధాన బాధ్యత యుద్ధంలో ఉన్న దేశాలదేనని చెప్పారు. అయితే ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ముగింపచేయటానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు జైశంకర్.

తమ దేశంపై అన్యాయమైన రష్యా యుద్ధానికి ముగింపు పలకాలన్న భారత ఆకాంక్షకు కృతజ్ఞతలు తెలిపారు జెలెన్‌స్కీ. కాగా చమురు కొనకపోవడం వల్ల ఈ యుద్ధం ఆగే పరిస్థితులు లేవని జైశంకర్‌ స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న ప్రశ్నకు స్పందించారు.

రష్యా నుంచి చమురు, అల్యూమినా, ఖనిజాలు, లోహాలు, ఎరువులు కొనుగోలు చేయడం లేదా చేయకపోవడం వల్ల యుద్ధం పరిష్కారం కాదన్నారు. భారత్‌ వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇంధన భద్రత ఎంతో కీలకమని జైశంకర్‌ అన్నారు.

ప్రపంచ ఇంధన పరిస్థితులు ఇప్పటికే క్లిష్టంగా ఉన్న సమయంలో దేశ ప్రజలకు అవసరమైన ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. ఉక్రెయిన్‌కు తన అభిప్రాయం ఉన్నట్లే భారత్‌కు కూడా తన వైఖరి ఉందని, ఇరు దేశాల అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రష్యా నుంచి చమురు, సహజవాయువును కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే బిల్లును అమెరికా సెనేట్‌ ఇటీవల ఆమోదించడం తెలిసిందే. ‘గ్రాహమ్‌ శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2026 కు సెనేట్‌లో ఆమోదం లభించింది.

రష్యా నుంచి గణనీయంగా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్‌, చైనా ఉన్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి వాణిజ్యం మద్దతుగా నిలుస్తోందని, తద్వారా ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలకు నిధులు సమకూరుతున్నాయని అమెరికా వాదిస్తోంది.

అయితే ఈ బిల్లుపై స్పందించాల్సిన అవసరం లేదని భారత్ చెబుతోంది భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇరు దేశాలు ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేసింది.

కాగా ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి రష్యా, భారత్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఢిల్లీలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. శాంతి చర్చల కోసం రష్యా సిద్ధంగా ఉందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉక్రెయిన్‌పై ఉందని ఆయన తెలిపారు.

రష్యా ఇప్పటికే తన శాంతి ప్రతిపాదనలను ముందుకు తెచ్చిందని, రాజీ దిశగా చర్యలు తీసుకుందని అలిపోవ్​ వివరించారు. అయితే, ఉక్రెయిన్ సహా దాని యూరోపియన్ మద్దతుదారులు పోరాటాన్ని కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉక్రెయిన్ పరిధిలో ఉందని ఆయన అన్నారు.చర్చలు, దౌత్యం కోసం భారత ప్రధాని మోదీ నిరంతరం చేస్తున్న పిలుపు రష్యా వైఖరికి అనుగుణంగానే ఉందన్నారు.

ఈ వివాదానికి ముగింపు పలకడానికి భారత్ చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. భారత్- రష్యా సంబంధాల అభివృద్ధిలో మోదీ- పుతిన్ మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఒక కారమన్నారు అలిపోవ్.

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభానికి ముందు వరకూ భారత్ ముడి చమురు దిగుమతులలో రష్యా చమురు వాటా కేవలం 0.2 శాతంగా మాత్రమే ఉండేది.

అయితే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తరువాత, పాశ్చాత్య దేశాలు మాస్కోను బహిష్కరించడంతో తక్కువ ధరకు లభించే రష్యా ముడి చమురుకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. అమెరికా ఆంక్షలు, సుంకాలు విధించినా భారత్ ఈ కొనుగోళ్లను ఆపేయలేదు.

మన దేశం ముడి చమురులో సుమారు 88 శాతాన్ని విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది, దీనిని పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. అందులో మూడింట ఒక వంతు రష్యా నుండే వస్తుంది. భారతదేశ ముడి చమురు దిగుమతులలో 40 శాతానికి పైగా ఉంటుంది. క్లెప్లర్ డేటా ప్రకారం, ఆగస్టులో భారతదేశం రష్యా నుండి రోజుకు సుమారు 2.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story