Off The Record: సిర్పూర్ సమరంలో కొత్త ట్విస్ట్!

Off The Record: సిర్పూర్ రాజకీయం వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్‌లపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచలన ఆరోపణలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2026 11:58 AM IST
Off The Record
X

Off The Record: సిర్పూర్ సమరంలో కొత్త ట్విస్ట్!

Off The Record: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపానికి దారి తీసింది. నియోజకవర్గ సమస్యలపై పరస్పర విమర్శలు, సవాళ్లతో స్థానిక రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ ముగ్గురు నేతలు.. ఇప్పుడు సిర్పూర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కోనప్ప మాత్రం హరీష్‌బాబు, దండే విఠల్ ఇద్దరూ ఒకటేనని ఆరోపిస్తున్నారు. ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకొని.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి వేర్వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కోనప్ప.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ గుర్తుపై పోటీ చేసిన కోనేరు కోనప్ప స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల తర్వాత సిర్పూర్ రాజకీయ సమీకరణాలు మరింత మారిపోయాయి. కోనప్ప కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థుల లెక్కలు కూడా మారాయి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్యకర్తలతో వరుస సమావేశాలు, చేరికలతో కాంగ్రెస్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగించారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు తన నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్–బీజేపీ మధ్య పైకి రాజకీయ విమర్శలు కొనసాగుతున్నా.. కాగజ్‌నగర్ మున్సిపల్ రాజకీయాల్లో మాత్రం రెండు పార్టీల మధ్య ఏర్పడిన సమీకరణాలు చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌కు మున్సిపల్ పీఠం దక్కేలా బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు మద్దతు ఇవ్వడం అప్పట్లో స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఇదే అంశాన్ని ఇప్పుడు కోనేరు కోనప్ప తన రాజకీయ విమర్శలకు ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. హరీష్‌బాబు, దండే విఠల్ ఇద్దరూ ఒకే తాటిపై ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

అయితే కోనప్ప ఆరోపణలను ప్రత్యర్థి పార్టీలు ఎలా తిప్పికొడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిర్పూర్‌లో బీఆర్‌ఎస్ కేడర్‌ను తిరిగి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. ఈ నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు తన రాజకీయ పట్టు కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో సిర్పూర్‌లో అసలు పోరు ఎవరి మధ్య..? కాంగ్రెస్–బీజేపీ మధ్యనా..? లేక కోనప్ప వర్సెస్ హరీష్‌బాబు–దండే విఠల్ మధ్యనా..? అన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి.. ఈ రాజకీయ ఆరోపణల పర్వం భవిష్యత్‌లో ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్