Off The Record: కొండా సురేఖ స్థానంలో విజయశాంతి ?

Off The Record: తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశం ఆ స్థానంలో సీనియర్ నేత విజయశాంతికి మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 9:00 AM IST
Off The Record
X

Off The Record: కొండా సురేఖ స్థానంలో విజయశాంతి ? 

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో జరగబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, వివాదాల్లో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించి, ఆమె స్థానంలో సీనియర్ నాయకురాలు విజయశాంతికి కేబినెట్ బెర్త్ కల్పించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. కూతురు చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ సమర్థించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. మంత్రి సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని సిఫారసు చేస్తూ ఏఐసీసీకి నివేదిక సమర్పించింది.

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే, ఖాళీ అయ్యే మహిళా కోటా స్థానంలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని కేబినెట్‌లోకి తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ పరంగా విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈనెల మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మార్పులు, చేర్పులు ఉండవచ్చని వార్తలొస్తున్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు విడతలుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది.

అయితే ఇటీవల తన కూతురు సుష్మితా పటేల్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరొచ్చిందనే చర్చ రీసౌండ్ చేస్తోంది. ఈ క్రమంలో సురేఖను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన అంతటా తాను రాజీనామా చేయడమా..? లేదా పార్టీనే ఆమెను భర్తరఫ్ చేయడమా..? అనే ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా.. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

బీసీ మహిళను తొలగిస్తే అదే ఈక్వేషన్స్‌ ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహరచన చేస్తోందట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

అందులో కొండా సురేఖ మాత్రమే బీసీ మహిళా కేటగిరికి చెందిన ఎమ్మెల్యే. ఒకవేళ సురేఖ స్థానం ఖాళీ అయితే అదే సామాజికవర్గం మహిళతో కేబినెట్‌ బెర్త్‌ను భర్తీ చేయనున్నారట. ఈ సమీకరణాల ప్రకారం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు, సీనియర్ కాంగ్రెస్ నేత విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కొండా సురేఖ ఖాళీని విజయశాంతితో పూరించలన్న ఆలోచనలో అధిష్టానం ఉందట. అయితే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చినప్పుడు.. తనకు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు.. కానీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తే చాలని ఢిల్లీ పెద్దలను విజయశాంతి కోరినట్లు సమాచారం.

మొత్తమ్మీద.. సురేఖను కేబినెట్ నుంచి తప్పించినా.. ఆమె స్వయంగా తప్పుకున్నా ఏర్పడే ఖాళీలో విజయశాంతికి ఛాన్స్ ఇస్తారా..? లేదా మరొకరిని మంత్రిమండలిలోకి తీసుకుంటారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story