Off The Record: గందరగోళంలో కోమటిరెడ్డి.. సొంత పార్టీ నే షాక్ ఇవ్వనుందా

Off The Record: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి ఊడుతుందంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు నిజాలేంటి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 6:49 AM IST
Off The Record
X

Off The Record: గందరగోళంలో కోమటిరెడ్డి.. సొంత పార్టీ నే షాక్ ఇవ్వనుందా

Off The Record: నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిపై జరుగుతున్న చర్చ రచ్చరచ్చ అవుతోంది. తెలంగాణ సాధన కోసం నాడు మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర వెంకన్నది. అలాంటి నాయకుడిపై ఇప్పుడు సొంత పార్టీలోనే కొందరు నేతలు కుట్రలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతోందన్న వార్తలు.. అన్న పదవికి గండంగా మారాయనే సంకేతాలు జిల్లాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి నల్లగొండలో ఇద్దరు సోదరులు మంత్రులుగా ఉంటే తప్పేంటి? అన్నది వెంకన్న అనుచరుల ప్రశ్న. కానీ, పార్టీలోని మరో వర్గం మాత్రం 'ఒక కుటుంబంలో ఒకరికే పదవి' అనే నిబంధనను పదే పదే తెరపైకి తెస్తోంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎక్కడ పదవి గురించి మాట్లాడినా.. అది నేరుగా అన్నయ్య వెంకటరెడ్డిని టార్గెట్ చేసినట్లుగా మారుతుండటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం మరీ ఘోరంగా ఉంది. వెంకన్న పదవి రేపో మాపో ఊడిపోతుందంటూ పనిగట్టుకుని పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక జిల్లాలోని ఓ సీనియర్ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రదర్స్ కారణంగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లాంటి సామాజికవర్గ నేతలకు క్యాబినెట్‌లో చోటు దక్కడం లేదనే నెగిటివ్ ప్రచారాన్ని కూడా జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.

మరోవైపు అభివృద్ధి విషయంలో వెంకటరెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నల్లగొండ నియోజకవర్గాన్ని.. కేవలం రెండేళ్లలో 3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పథంలో నిలిపారు. 500 కోట్లతో బైపాస్ రోడ్డు, 150 కోట్లతో లతీఫ్ సాహెబ్ గుట్ట రోడ్డు, ఎస్ఎల్బీసీ సాగర్ కెనాల్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవేళ రాజకీయ కారణాలతో వెంకన్నను పక్కన పెడితే.. ఈ ప్రాజెక్టులన్నీ అటకెక్కుతాయని, జిల్లా అభివృద్ధి మళ్లీ పదేళ్లు వెనక్కి పోతుందంటూ పార్టీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలతో పోటీ పడుతూ వెంకన్న తన కేడర్‌ను కాపాడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో తన మార్కు పాలన సాగిస్తున్న తరుణంలో ఇలా పదవి ఊడుతుందనే వార్తలు రావడం.. కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంటోంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకులు కూడా.. వెంకన్న ఉంటేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారట. ఢిల్లీ నుంచి రాజగోపాల్‌కు హామీ లభించిందని వస్తున్న వార్తలు నిజమైతే.. అది నల్లగొండ కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తానికి నల్లగొండ గడ్డపై 'కోమటిరెడ్డి' పట్టును సడలించేందుకు గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరినట్లు కనిపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పదవుల వేట. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న నల్లగొండ కాంగ్రెస్ కేడర్. మరి హైకమాండ్ వెంకన్న రాజీనామా కోరుతుందా? లేక తమ్ముడిని వెయిటింగ్‌లో పెడుతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్. నల్లగొండ రాజకీయం రసవత్తరంగా మారింది.. మరి క్లైమాక్స్ ఎటువైపు వెళ్తుందో చూడాలి!.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story