Off The Record: కేసీఆర్ గ్రాండ్ కమ్ బ్యాక్!

Off The Record: అసెంబ్లీలో సస్పెన్షన్ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ కేసీఆర్. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల సందర్శనతో ప్రభుత్వాలపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2026 8:00 AM IST
Off The Record
X

Off The Record: కేసీఆర్ గ్రాండ్ కమ్ బ్యాక్!

Off The Record: అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్‌తో సభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేకపోవడంతో.. ఇప్పుడు ప్రజాక్షేత్రాన్నే వేదికగా చేసుకోవాలని గులాబీ పార్టీ డిసైడ్‌ అయింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు.

కేసీఆర్‌ ఇచ్చిన తాజా సిగ్నల్స్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు ఫామ్‌హౌస్‌ వేదికగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన కేసీఆర్‌లో ఉన్నట్టుండీ ఇంత మార్పు ఏంటి..? అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ప్రజల్లోకి రావడమే కాదు.. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను స్వయంగా సందర్శించాలన్న కేసీఆర్‌ ఆలోచన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టుల వద్ద భారీగా గులాబీ శ్రేణులను, ప్రజలను సమీకరించి కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎర్రవల్లి నుంచి ప్రాజెక్టుల వైపు కేసీఆర్‌ అడుగులు వేయనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం బీఆర్‌ఎస్‌కు లేకుండా పోయిందన్న చర్చ లేకపోలేదు.

ముఖ్యంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలు, సాగునీటి ప్రాజెక్టులు, 22ఏ భూవివాదం, విద్యుత్‌ సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై సభలో గట్టిగా ప్రశ్నించాల్సిన సమయంలో సస్పెన్షన్‌తో ఆ అవకాశం దూరమైందన్న అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. అయితే సభలో అవకాశం లేకపోతే ప్రజల్లోనే ప్రభుత్వాన్ని నిలదీద్దామన్న వ్యూహంతో బీఆర్‌ఎస్‌ ముందుకు వెళ్తోందట. అందుకే కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రాజెక్టులే రాజకీయ పోరాట కేంద్రాలుగా మల్చుకోవాలని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారట. ఇందులోభాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలకు అదే ప్రాజెక్టు వేదికగా సమాధానం చెప్పడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీయడం.. ఇలా ప్రాజెక్టులనే రాజకీయ పోరాట కేంద్రాలుగా మార్చాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో రెండు ప్రాజెక్టుల వ్యవహారంగానే కాకుండా.. కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తన రాజకీయ అజెండాలోకి తీసుకురావడానికి బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోందని చర్చ జరుగుతోంది.

“సాగునీరు కావాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు..? కరెంట్‌ సమస్యల పరిష్కారం ఎక్కడ..? ఇచ్చిన హామీల అమలు ఏంటి..?”ఇలా ఒక్కో అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రాజీలేని రాజకీయ ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. మరోవైపు ఈ నెలలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించనున్న కేసీఆర్‌.. ఈ భేటీలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరగనుందట.

జిల్లాల వారీగా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై పోరాటం చేయబోతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ ఫామ్‌హౌస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ను నడిపించిన కేసీఆర్‌.. ఇక తెలంగాణ ప్రజల మధ్యే నిలబడి రాజకీయంగా అదే గొంతును మరింత బలంగా వినిపించాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

అసెంబ్లీలో సస్పెన్షన్‌తో ప్రజల సమస్యలను లేవనెత్తే అవకాశం మిస్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రజల మధ్యకు వెళ్లి మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరగడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కాళేశ్వరం నుంచి పాలమూరు వరకు, రైతు సమస్యల నుంచి విద్యార్థుల సమస్యల వరకు ప్రతి అంశంపై కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

అయితే రాష్ట్ర కమిటీ భేటీలో కేసీఆర్‌ ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించబోతున్నారనే దానిపై క్లారిటీ రానుందట. మొత్తానికి ఫామ్‌హౌస్‌ నుంచి గులాబీ బాస్‌ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఎక్కడెక్కడ కేసీఆర్‌ పర్యటన ఉంటుంది..? ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్