Burning Topic: మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయం
Burning Topic: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం! సిద్ధరామయ్య రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు. కొత్త ప్రభుత్వంలో ఏం జరగబోతోంది?
Burning Topic: మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయం
Burning Topic: కర్ణాటక రాజకీయాల్లో ఇక్కసారిగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య.. తన పదవి నుంచి దిగిపోయారు. ఆయన స్థానంలో డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఇచ్చిన మాట ప్రకారం.. డీకే వర్గం నుంచి వచ్చిన వత్తిడికి పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా సూచించక తప్పలేదు.కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం అనేది ప్రతి ఒక్క ముఖ్య నేతకు ఓ కల.. దాన్ని నెరవేర్చుకునేందుకు ఎత్తుకుపైఎత్తులు వేయాల్సి ఉంటుంది. సీఎం పీఠం దక్కినా ఐదేళ్ల పాటు ఈ పదవిలో కూర్చొంటామనే గ్యారెంటీ లేదు. రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
నిశ్చలత.. సుస్థిరత అనేది కన్నడ రాజకీయాల్లో ఎండమావిగానే మిగిలిపోయింది. ఉన్నత పదవికి సోపానమే ధ్యేయంగా, జీవిత లక్ష్యంగా నేతలకు మారడంతో రాష్ట్ర నేతల వ్యూహాలు, హైకమాండ్‌ల నిర్ణయాలు ముఖ్యమంత్రి పోస్టును మూణ్నాళ్ల ముచ్చట చేశాయి.
కర్ణాటక రాజకీయ చరిత్రలో ఒకరిద్దరు మినహాయించి ఏ ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు. 1956 నుంచి చరిత్రను గమనిస్తే పాత మైసూరు స్టేట్, ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పని చేసిన వారు ముగ్గురు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎస్. నిజలింగప్ప రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956లో ఏడాదికిపైగా ఆ పదవిలో ఉన్న ఆయన.. 1962లో మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించారు. 1968 వరకు అంటే ఐదేళ్ల 345 రోజులు అధికారంలో కొనసాగారు. అదే పార్టీకి చెందిన డి. దేవరాజ్ ఉర్స్ 1972 నుంచి 1977వరకు, తర్వాత సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు పూర్తికాలం ముఖ్యమంత్రులుగా కొనసాగారు.
కర్ణాటకలో అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులూ ఉన్నారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని సందర్భాల్లో ఎన్నికల అనంతరం పొత్తులు కుదిరినా.. అవి నిలబడలేదు. దాంతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలున్నాయి.
బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్ప 2007లో కేవలం వారం రోజులే సీఎం పదవిలో ఉన్నారు. బీజేపీ-జేడీఎస్ కూటమిలో సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.
కాంగ్రె్ సీనియర్ నేత వీరేంద్రపాటిల్ రాజీనామా చేయడంతో 1971లో కొన్నివారాల పాటు ఎస్‌ఆర్ కాంతి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్ నేత ధరమ్ సింగ్ కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిపైగా ఆ కుర్చీలో కొనసాగినా.. కూటమిలోని వైరుద్ధ్యాలతో ఆ ప్రయాణం సవ్యంగా సాగలేదు. దాంతో ఆయన 2006లో పదవిని కోల్పోయారు.
2012లో బీజేపీలో అంతర్గత రాజకీయాల కారణంగా సదానందగౌడను పక్కనపెట్టడంతో జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. 305 రోజులు పదవిలో ఉన్నారు. తర్వాత అసెంబ్లీ గడువు ముగిసింది.
ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు మొదలైంది. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ సహనంతో ఎదురు చూశారు. ఇప్పుడు కాలం కలిసొచ్చింది. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. ఏ రాష్ట్రంలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎలా పని చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
డీకే శివకుమార్ నేతృత్వంపై కాంగ్రెస్‌లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను క్రమశిక్షణ గల, కష్టపడి పనిచేసే నాయకుడిగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకు బలమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక అగ్నిపరీక్షను కూడా పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సిద్ధరామయ్య చెందిన కురుబా సామాజిక వర్గం నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఓబీసీ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. శివకుమార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని నిలబెట్టగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక సిద్దరామయ్య గత 50 ఏళ్లుగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న అంత సులభంగా పదవిని వదులుకోలేదు. హైకమాండ్ ఎదుట పలు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వశాఖను కేటాయించాలని.. విద్య, వైద్య.. వెనుకబడిన తరగతుల వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని అడిగినట్లు చెబుతున్నారు సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించేందుకు రాహుల్ గాంధీ ఒప్పించే ప్రయత్నం చేసినా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగనున్న ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండేలా సిద్దూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. లింగాయత్, దళిత వర్గాల నుండి డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశముంది.




