Burning Topic: ఇరాన్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు పాలిస్తుంది ఎవరు?
Burning Topic: ఇరాన్‌లో ఏం జరుగుతోంది? సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ కోమాలోకి జారుకున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సైన్యం (IRGC) పెత్తనం.
Burning Topic: ఇరాన్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు పాలిస్తుంది ఎవరు?
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో పశ్చిమాసియా నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై, కోమాలోకి జారుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ దేశాన్ని పరిపాలించలేని స్థితిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఈ మేరకు ఓ రహస్య దౌత్య నివేదిక అమెరికా, ఇజ్రాయెల్ తమ గల్ఫ్ మిత్రదేశాలతో పంచుకున్నాయి. ఫిబ్రవరి 28 నాడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నారు. అయితే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఒక్కసారి కూడా బయటకు కనిపించలేదు. మొజ్తాబాకు సంబంధించిన అనేక వార్తలు, పుకార్లు వినిపిస్తున్నా, ఇరాన్ దేన్ని కూడా ఇప్పటి దాకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
బ్రిటన్ పత్రిక 'ది టైమ్స్' అందించిన తాజా కథనం ప్రకారం.. మొజ్తాబా ఖమేనీ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 28న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:32 గంటలకు ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంటి మీదకు దూసుకొచ్చాయి. ఈ దాడి చేయడానికి కేవలం కొన్ని క్షణాల ముందు మొజ్తాబా ఖమేనీ తోటలో నడవడానికి బయటకు రావడంతో తృటిలో తప్పించుకున్నారు. అలీ ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులంతా మరణించినా, మొజ్తాబా గాయాలతో బయట పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను రష్యా రాజధాని మాస్కోకు రహస్యంగా తలరించి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మొజ్తాబా ఇరాన్‌లోనే ఉన్నారని, బయటకు వెల్లడించలేని కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదని రష్యా రాయబారి తెలిపారు. ఇరాన్ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు.
యుద్ధం ప్రారంభైన కొత్త రోజుల్లోనే మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా ప్రకటించారు. అయితే మొజ్తాబా ఖమేనీ తమ తొలి దాడిలోనే తీవ్రంగా గాయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రాణాలు కూడా కోల్పోయి ఉండొచ్చని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ఈ విషయంలో ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సుప్రీంలీడర్ టీవీలో కానీ, అధికారిక కార్యక్రమాల్లో కానీ మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోయినా పేరుతో తరచూ ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి. వాటి చాలా సందర్భాల్లో సుప్రీం లీడర్ కనుసన్నల్లో నడిచే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ - IRGC వీటిని వెలువరుస్తూ వచ్చింది. తాజాగా హోర్ముజ్ జలసంధిని వెరవాలని హెచ్చరిస్తూ కాల్పుల విరమణపై తాజా డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు కూడా మొజ్తబా ఖమేనీ స్పందన వచ్చింది. ఆయన పేరుతో చివరి సందేశం వచ్చింది. ఇరాన్ ఎవరికీ తలొగ్గదని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అందులో హెచ్చరించారు.
ది టైమ్స్ పత్రిక తాజా కథనం ప్రకారం పూర్తిగా అపస్మార స్థితిలో ఉన్న మోజ్తాబా ఖమేనీ ఇకపై పాలించగల సామర్థ్యం లేనివాడు. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. సైనిక కార్యకలాపాలలో పాల్గొనే స్థితిలో కూడా లేరు సుప్రీంలీడర్ పేరుతో వస్తున్న సందేశాలు కూడా వాస్తవానికి ఆయనవి కాదు. వీటిని చాలా వరకూ ఐఆర్‌జీసీ జారీ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల ప్రకారం హర్మూజ్ జలసంధిని తాను విధించిన గడువులోపు తెరవకపోతే ఇరాన్‌లోని కీలకమైన పవర్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలన్నింటినీ ఒకే రాత్రిలో నేలమట్టం చేస్తారు. ఆయన ఇలా హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రం చేసింది. ఇప్పటికే ఇరాన్‌లో కీలక నాయకులను అమెరికా మట్టబెట్టింది. సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమించడం, మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ వైపు నుండి దాడులు ముమ్మరం కావడంతో ఇరాన్ సైన్యం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని వార్తలు వస్తున్నాయి.
మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న తీరుపై కూడా అనేక వివాదాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయన తండ్రి అలీ ఖమేనీ తన కుమారుడు సుప్రీం లీడర్ పదవికి వారసునిగా రావడాన్ని అంగీకరిచలేదు. ఆయన బతికి ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు, కానీ సుప్రీం నాయకున్ని ఎన్నుకోవడంలో కీలకంగా వ్యవహరించే 88మంది మతగురువుల బృందం మీద ఐఆర్‌జీసీ తీవ్ర వత్తిడి తెచ్చింది. అదే సమయంలో ప్రస్తుతం దేశం యుద్ధాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలీ ఖమేనీ కుమారుని వైపే మొగ్గు చూపక తప్పలేదు. అనేక తర్జన భర్జనల తర్వాత మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీంగా ప్రకటించేశారు. ముజ్తబా తన తండ్రిలా అలీ ఖమేనీకి విరుద్దంగా . బయటికి పెద్దగా కనిపించేవారు కాదు. ఎలాంటి ప్రభుత్వ పదవీ నిర్వహించలేదు. బహిరంగ ఉపన్యాసాలు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ఆయనకు పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్స్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి.
మరోవైపు సుప్రీంలీడర్ అలీ ఖమేనీ ఆస్పత్రికే పరిమితం కావడాన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ పాలనా వ్యవహారాలపై ఐఆర్‌జీసీ పెత్తనం చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. క్రమంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అధికారాలు కూడా తగ్గించేసి నామమాత్రంగా మార్చేశారు. ఐఆర్‌జీసీ సీనియర్ అధికారులతో కూడిన ఒక సైనిక మండలి ఇప్పుడు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం సుప్రీంలీడర్‌ను కలిసేందుకు అధ్యక్షుడు పెజెష్కియాన్ సమాచారం పంపగా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొజ్తాబా చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటుచేసి, అధ్యక్షుడు చేపట్టే నియామకాలు, నిర్ణయాలపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం పెజెష్కియన్ శాంతి ప్రతిపాదన చేస్తే, ఐఆర్‌జీసీ మాత్రం అమెరికాతో యుద్ధం కొనసాగిస్తామని ప్రకటన చేసింది. దీంతో ఇరాన్‌ను ఎవరు నియంత్రిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఐఆర్‌జీసీకి, అధ్యక్షుడికి మధ్య విభేదాలు ఏర్పడంతో ఇరాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది.


