Burning Topic: పాక్ కాళ్ళు పట్టుకున్నా వినని ఇరాన్.. ఇస్లామాబాద్ చర్చలు రద్దు?
Burning Topic:
Burning Topic: పాక్ కాళ్ళు పట్టుకున్నా వినని ఇరాన్.. ఇస్లామాబాద్ చర్చలు రద్దు?
Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినా శాంతి చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఇరుదేశాల ప్రతినిధుల రాకపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో భేటీపై అనిశ్చితి నెలకొంది. ఈ చర్చల కోసం 10 మంది సభ్యులతో కూడిన ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు వస్తుందని తెప్పినా లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడం పరిస్థితి మారిపోయింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంటే చర్చకు అర్థం లేదని, తాము వైదొలగుతామని చెబుతున్నారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా పరస్పరం అపనమ్మకాలు కొనసాగుతున్నాయి. చర్చలపై ఎలా ముందుకు సాగాలి అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. కాగా ఈ చర్చల్లో అమెరికా ఏం చెబుతుంది? దానికి ఇరాన్ ఏమంటుంది? అనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కాగా ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో లెబనాన్‌పై దాడుల నిలుపుదల, ఇరాన్ అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధిపై నియంత్రణ, ఆంక్షల సడలింపు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. అమెరికా తరపున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు పశ్చిమాసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు- మాజీ సలహాదారుడు జేర్డ్ కుష్నర్ పాల్గొంటున్నారు. ఇరాన్ తరపున ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఘాలిబఫ్ , విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇరాన్ సైన్యం ప్రతినిధి హాజరు అవుతున్నారు. అయితే అమెరికా, ఇరాన్ బృందాలు వేర్వేరు గదుల్లో కూర్చొంటాయి. పాక్ అధికారులు ఒకరి సందేశాన్ని మరొకరికి చేరవేస్తారు.పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉభయపక్షాలతో విడివిడిగా ప్రాథమిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పాక్ విదేశాంగ మంత్రి ఇశాక్ డార్ దీని సమన్వయ బాధ్యతలు తీసుకుంటారు.
తాము అనుకున్నవి సాధించేందుకు ఇరాన్ మీద ఒత్తిడి పెంచాలని అమెరికా నిర్ణయించింది ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న డిమాండ్‌పై పట్టుబట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను తనిఖీ చేసే అవకాశం ఇవ్వాలని కోరనుంది. తమ డిమాండ్లలో పెద్దగా సడలింపులు లేకుండా వీలైనంతగా ఒత్తిడి తీసుకురావమే లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా. చర్చల వరకు లాక్కొచ్చాం కాబట్టి మేం చెప్పినట్లు చేయండని అడగడంతో పాటు, ఎక్కువ సమయం ఇవ్వకుండా తేల్చిచెప్పాలని డిమాండ్ చేయనుంది.
కాగా ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా తమ డిమాండ్లను వినిపించనుంది. చర్చలకు తాము సముఖమేనని చెబుతూ అమురికా ఒత్తిళ్లను లొందేది లేదని ప్రపంచానికి చాటనుంది.అమెరికా అసలు ఉద్దేశాలేమిటో గ్రహించడంతో పాటు దేనికీ అంగీకరించకుండా చర్చల్ని సాగదీసే అవకాశం ఉంది. అదనంగా లభించిన సమయంలో సైనికపరంగా బలపడేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. తన అణు కార్యక్రమాన్ని సమర్థించుకుంటూ, ఆంక్షల ఎత్తివేతతో అణుశుద్ధికి లంకె పెట్టే అవకాశం ఉంది
ఇక ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలోలో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. ఈ నేపథ్యంలో హర్మూజ్ నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటిస్తూ ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఇకపై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ఆయన చేసిన ప్రకటనను అధికారులు వినిపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా, అనేకమంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నామన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారికి న్యాయం చేయాలని, బాధితులకు పరిహారం ఇవ్వాలని ఒత్తిడి తీసుకుకొస్తామన్నారు.. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని హెచ్చరించారు మొజ్తాబా. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లో వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రదర్శనలు జరిపారు.
కాగా హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. జలసంధి మీదుగా వెళ్లే ట్యాంకర్లపై ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. వారు ఒకవేళ చేస్తే వెంటనే ఆపేయాలని హెచ్చరించారు. ఇరాన్ సహకరించినా.. సహకరించకపోయినా జలసంధి మీదుగా చమురు సరఫరా త్వరగా ప్రారంభమవుతుందని మరో పోస్టులో పేర్కొన్నారు. అసలైన ఒప్పందం అమలు చేసే వరకూ అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బందితో పాటు అదనపు మందుగుండు సామగ్రి, ఆయుధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైతే శత్రువునుపూర్తిగా నాశనం చేయడానికి ఏం చేసేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం చాలా తక్కువని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఒప్పుకునేదిలేదని స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా ఇటీవల టెహ్రాన్‌లో జరిగిన దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సీనియర్ కమాల్ ఖర్రాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం ఇరాన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓవైపు శాంతి ప్రక్రియ కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. కువైట్ తన దేశంలోని కీలక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించింది. ఈ దాడులకు ఇరాన్ లేదా దాని అనుబంధ బలగాలే కారణమని అనుమానం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలోని కీలకమైన ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌పై కూడా దాడి జరిగినట్లు చెబుతున్నారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఈ పైప్‌లైన్‌పై దాడి జరగడం ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతోంది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కువైట్, సౌదీపై జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ దాడులు జరిగి ఉంటే.. అవి అమెరికా లేదా ఇజ్రాయెల్ కుట్ర అయి ఉండొచ్చని ఆరోపించింది.
మరోవైపు అమెరికా నేవీకి చెందిన నిఘా డ్రోన్ MQ-4C ట్రిటాన్ హర్మూజ్ జలసంధిలో మాయమైంది. అత్యవసర హెచ్చరిక చేసిన కాసేపటికే రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిలో నిఘా నిర్వహించి ఇటలీలోని నావికా స్థావరానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ మానవ రహిత డ్రోన్ ప్రమాదానికి గురైందా లేదా ఎవరైనా నేలకూల్చారా స్పష్టతలేదు. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో MQ-4C ట్రిటాన్ డ్రోన్ ధర 200 మిలియన్ డాలర్లు ఉంటుంది. గల్ఫ్ ప్రాంతంలో నిఘా కోసం అమెరికా సైన్యం దానిని మోహరించిందని తెలిపింది. సాధారణ నిఘా డ్రోన్లతో పోలిస్తే ఈ మానవరహిత డ్రోన్ ఎక్కువ సమయం గగనలతలంలోనే ఉండి సేవలందించగలదని నిపుణులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు.




