hmtv Organic Mela 2026: ఒకే ఎరువుతో 3,500 రకాల పంటల సాగు.. ‘దాత్రి’ బయో ఫెర్టిలైజర్‌కు రైతుల్లో భారీ ఆదరణ!

hmtv Organic Mela 2026: హైదరాబాద్‌లో జరుగుతున్న హెచ్ఎంటివి ఆర్గానిక్ మేళాలో 'రైతు ప్రయోగశాల' బృందం సహా పలు బయో కంపెనీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Arun Chilukuri
Updated on: 30 May 2026 5:17 PM IST
hmtv Organic Mela 2026
X

hmtv Organic Mela 2026: హెచ్ఎంటివి ఆర్గానిక్ మేళా: ఒకే ఎరువుతో 3,500 రకాల పంటల సాగు.. ‘దాత్రి’ బయో ఫెర్టిలైజర్‌కు రైతుల్లో భారీ ఆదరణ!

hmtv Organic Mela 2026: హైదరాబాద్ నగరంలో రెండవ రోజు కూడా ఉత్సాహంగా, విజయవంతంగా కొనసాగుతున్న హెచ్ఎంటివి (hmtv) ఆర్గానిక్ మేళా సరికొత్త వ్యవసాయ ఆవిష్కరణలకు వేదికైంది. కేవలం వినియోగదారుల కోసమే కాకుండా, సాగు వ్యయం తగ్గించుకుని రికార్డు దిగుబడులు సాధించాలనుకునే రైతుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా బయోలాజికల్, ఆర్గానిక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది ప్రగతిశీల రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న 'రైతు ప్రయోగశాల' స్టాల్ ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రైతు ప్రయోగశాల ప్రతినిధి బ్రహ్మయ్య మాట్లాడుతూ.. తాము గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడి 'దాత్రి సూక్ష్మ జీవుల సేంద్రీయ సహజ ఎరువు' (Dhatri Microbial Organic Fertilizer) ను ప్రయోగాత్మకంగా తయారు చేశామని వెల్లడించారు.

ఈ ఒక్క ఎరువుతోనే దాదాపు 3,500 రకాల పంటలను పండించవచ్చు. రసాయన ఎరువుల్లో ఉండే యూరియా, డిఏపి (DAP) వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలన్నీ సహజ సిద్ధంగా ఈ ఒక్క ఎరువు బ్యాగ్‌లోనే లభిస్తాయి. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కేవలం ఈ ఒక్క ఎరువుతోనే విజయవంతంగా సాగు చేయవచ్చని నిరూపితమైంది.

ఈ పద్ధతిలో నంద్యాలకు చెందిన రైతు హుసేన్ రెడ్డి 16 ఎకరాల్లో రసాయనాలు లేకుండా వరి పండించి, ఎకరాకు 25 క్వింటాళ్ల రికార్డు దిగుబడి సాధించారు. ఈ పంటను ల్యాబ్‌లో 560 రకాల యుఎస్, యుకె ఎక్స్‌పోర్ట్ స్టాండర్డ్స్ ప్రకారం పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్ చేయించగా.. ఎలాంటి రసాయన అవశేషాలు లేవని తేలింది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్గానిక్ పంటలకు భారీ డిమాండ్ ఉంది. రసాయన ఎరువులు, విదేశీ ముడిసరుకుతో కూడిన పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య రైతుకు భారం అవుతున్న తరుణంలో, ఈ బయోలాజికల్ మందులు 5 రెట్లు తక్కువ ఖర్చుతోనే మెరుగైన లాభాలను అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. రైతులు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా, తాము పండించిన ఆర్గానిక్ పంటలను స్వయంగా విదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికంగా స్థిరపడాలన్నదే 'రైతు ప్రయోగశాల' ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

మేళాలో ఆకట్టుకుంటున్న ఇతర ప్రముఖ బయో కంపెనీలు:

గ్రీన్ హీల్ లైఫ్ సొల్యూషన్స్ (Green Heal Life Solutions): సైంటిస్ట్ డాక్టర్ ఇడుపుగంటి శ్రీలత నేతృత్వంలో 20 ఏళ్ల పరిశోధనల ఆధారంగా 100% కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. విత్తనం నాటినప్పటి నుండి బలానికి, పురుగులకు, తెగుళ్ల నివారణకు పనిచేసే సహజసిద్ధ ఉత్పత్తులు వీరి స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి.

సుస్థిర బయో ఆర్గనిక్స్ (Susthira Bio Organics): బెంగళూరుకు చెందిన ఈ సంస్థ లాక్టోబాసిల్లస్ స్పీషీస్ (Lactobacillus species) పై ల్యాబ్ రీసెర్చ్ చేసి ప్లాంట్ గ్రోత్, సకింగ్ పెస్ట్ (రసం పీల్చే పురుగులు) కంట్రోల్ వంటి ప్రత్యేక ప్రొడక్ట్స్‌ను అందిస్తోంది. రైతుల పొలాల్లోకే వెళ్లి వీరు డైరెక్ట్ గైడెన్స్ ఇస్తుండటం విశేషం.

కృషి బయోటెక్ (Krishi Biotech): హైదరాబాద్ కేంద్రంగా గత 16 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ సంస్థ పర్యావరణ హితమైన బయో ఆర్గానిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. సైంటిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయంతో పాటు ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు సరిపోయే ఎకో-ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ను వీరు రూపొందించారు.

ఆనంద్ ఆగ్రో కేర్ (Anand Agro Care): నాసిక్ బేస్డ్ కంపెనీ అయిన వీరు.. భూమి గట్టిపడకుండా వేరు వ్యవస్థ బలంగా ఎదిగేందుకు ఉపయోగపడే బయో గులికలు (NPK Granules), పూల పూతను (Female flowering) పెంచే ఆర్గానిక్ స్ప్రేలను అందిస్తున్నారు.

ఈ మేళాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు నుంచి కూడా పలువురు శాస్త్రవేత్తలు, రైతులు విచ్చేసి స్టాల్స్ ఏర్పాటు చేశారు. రసాయన వ్యవసాయానికి పూర్తి ప్రత్యామ్నాయంగా నిలిచే ఈ సేంద్రీయ ప్రదర్శనను రైతులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో విజిట్ చేస్తూ తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story