Burning Topic: అస్సాంలో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తున్న హిమంత బిశ్వ శర్మ..!

Burning Topic: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ముదిరిన రాజకీయ పోరు. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 11:20 AM IST
Burning Topic
X

Burning Topic: అస్సాంలో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తున్న హిమంత బిశ్వ శర్మ..!

Burning Topic: అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకు ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగేస్తున్నారు. అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణ చేసింది. అలాగే దుబాయ్‌లోని అల్ బర్షా సౌత్ ఫోర్త్ ప్రాంతంలో రెండు ఆస్తులకు యజమానిగా ఉన్నారని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో మరోవైపు హిమంత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించింది. అఫిడవిట్‌లో తన భార్యకు విదేశాల్లో ఉన్న ఆస్తులు ప్రస్తావించలేదని ఆరోపించింది.

మరోవైపు దుబాయ్, అమెరికావంటి దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద విచారణ జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. తన భార్య విదేశీ పాస్ ఫోర్టుల వ్యవహారంపై హిమంత ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్​ప్రచార విభాగం చీఫ్ పవన్​ ఖేరా నిలదీశారు. ఆ దంపతులు తమ కుమారుడితో కలిసి అమెరికాలో రూ. 52,000 కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారత్‌లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేనప్పుడు ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విదేశీ ఆస్తుల వివరాలను సీఎం ఎందుకు దాచారని నిలదీశారు. వెంటనే సీఎం హిమంతను అరెస్ట్ చేసి, కేంద్ర హోంమంత్రి జోక్యంతో సిట్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తన భార్యపై చేసిన ఆరోపణలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈ నిరాధారమైన, తప్పుడు ప్రచారానికి తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చూపించిన డాక్యుమెంట్లన్నీ మార్ఫింగ్ చేసిన నకిలీ పత్రాలని, వాటిలో పేర్లు, ఫొటోలు, తేదీల్లో ఎన్నో తప్పులు ఉన్నాయనివివరించారు. కాంగ్రెస్ నాయకులు వెల్లడించిన సమాచారానికి ఒక పాకిస్థానీ సోషల్ మీడియా గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వారు తనభార్యపై ఆరోపణలు చేయడానికి ఉపయోగించిన పత్రాలను 'పాకిస్థానీస్ ఇన్ అజ్మాన్' అనే సోషల్ మీడియా గ్రూపు నుంచి సేకరించారని తెలిపారు. పాకిస్థాన్​కు చెందిన ఒక వ్యక్తి పోగొట్టుకున్న పాస్‌పోర్టుపై ఆమె ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఇలా చేయడానికి కాంగ్రెస్​ నాయకులు పాకిస్తాన్​ సహాయం తీసుకోవడం ఏంటనివ ప్రశ్నించారు హిమంత. పవన్ ఖేరాపై 48 గంటల్లో క్రిమినల్, సివిల్ పరువు నష్టం దావా వేస్తామని.. అసత్యాలు ప్రచారం చేసినందుకు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

అస్సాం ఎన్నికలపై పాకిస్తాన్‌కు ఎందుకు అంత ఆసక్తి అని ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ. గత 10 రోజుల్లో, పాకిస్తాన్ ఛానెళ్లు అస్సాం ఎన్నికల గురించి కనీసం 11 టాక్ షోలు చేశాయి. ప్రతి షోలోనూ కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారని తెలిపారు. మరోవైపు తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో తనను వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. ప‌వ‌న్ ఖేడా వ్యాఖ్యల‌పై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని.. కానీ తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కాగా రిణికి భూయాన్ శర్మ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అస్సాం పోలీసులు ఢిల్లీలోని పవన్‌ ఖేరా నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన అక్కడ లేరు.. పవన్ ఖేరాను విచారించడానికి ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు అస్సాం పోటీసులు పవన్ ఖేరా ఇంటికి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఖేరా అరెస్టు భయంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ పారిపోయారని ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఎద్దేవా చేశారు. దాకా దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అంటూ ప్రగల్భాలు పలికిన పవన్ ఖేరా, తీరా పోలీసులు ఇంటికి వెళ్లేసరికి భయంతో హైదరాబాద్ పారిపోయారని ఆయన విమర్శించారు. పవన్ ఖేరాను త్వరలోనే ‘పవన్ పేడా’లా మారుస్తానన్నారు. కాగా ఖేరా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు మూడు రోజుల్లో ఉన్నాయనగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్‌ ఎంపీ, అస్సాం కాంగ్రెస్ సారధి గౌరవ్‌ గొగోయ్ భార్య ఎలిజబెత్‌ కాల్‌బర్న్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు పాకిస్తాన్‌ ఏజెంట్‌ అలీ తౌఖీర్‌ షేక్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయని, భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి సేకరించిన సమాచారాన్ని చేరవేస్తున్నారని విమర్శించారు. గొగోయ్‌ దంపతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఆమె ఆరుసార్లు పాక్‌ వెళ్లొచ్చారు. మరోఎన్జీఓలో చేరాక మూడుసార్లు వెళ్లారు. కాల్‌బర్న్‌ భారత్‌లో ఉండడం దేశానికి ప్రమాదకరం. గౌరవ్‌ గొగోయ్‌ కూడా 2013లో అత్యంత రహస్యంగా పాకిస్తాన్‌లో పర్యటించారు. అంటూ ఆరోపించారు. ఎలిజబెత్‌ కాల్‌బర్న్‌ భారత్‌కు రావడానికి ముందు ‘లీడ్‌ పాకిస్తాన్‌’ అనే సంస్థలో పనిచేశారని గుర్తు చేశారు. అయితే హిమంత చేసిన ఆరోపణలు సి–గ్రేడ్‌ సినిమా కంటే అధ్వాన్నమని అప్పట్లో గౌరవ్‌ గొగోయ్‌ ఎద్దేవా చేశారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story