Burning Topic: భారత్ ఎన్నికల విధానాన్ని మెచ్చుకున్న ట్రంప్!

Burning Topic: ట్రంప్ అమెరికాలో 'సేవ్ అమెరికా యాక్ట్' తేవాలని, భారత ఓటింగ్ విధానాన్ని ప్రశంసించారు. వివరాలకు [న్యూస్ 18](https://telugu.news18.com) చూడండి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Aug 2026 11:24 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్ ఎన్నికల విధానాన్ని మెచ్చుకున్న ట్రంప్!

Burning Topic: ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఆదర్శంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించే దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ దేశాన్ని ప్రజాస్వామ్య పరిరక్షకునిగా పిలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అతి కీలకం.

అయితే అమెరికా ఎన్నికల ఓటింగ్ విధానంపై ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఓటరు గుర్తింపు నిబంధనలు సక్రమంగా లేవు. ఎన్నికల రోజు తర్వాత వచ్చే బ్యాలెట్లను లెక్కించడం, పౌరసత్వ రుజువు కచ్చితంగా లేకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటరు నమోదు సమయంలో పౌరసత్వానికి కఠిన పత్రాలు చూపకుండా కేవలం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడటం విమర్శలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త చర్చను లేవనెత్తారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంపై ఆయన మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.

అమెరికా ఓటింగ్‌ విధానంలో లోపాలు ఉన్నాయని గత కొంత కాలంగా ట్రంప్‌, తన వాదనకు మద్దతుగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఉదాహరణగా చూపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

అమెరికాలో ఓటు వేయడానికి కఠినమైన నిబంధనలు ఉండాలని, ముఖ్యంగా పౌరసత్వ ధ్రువీకరణ, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో ఉన్న పటిష్టత, ముఖ్యంగా ఓటర్ల గుర్తింపు కార్డు వినియోగంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలో ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌తో తనకు జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకున్నారు. భారత్‌లో ఉన్న అందరు ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ కార్డులు ఉన్నాయని ట్రంప్ తన పోస్టులో గుర్తు చేశారు..

భారత్‌లో గత సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని తన పోస్టులో పేర్కొన్నారు డొనాల్ట్ ట్రంప్. వారిలో ఒక శాతానికంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని తెలిపారు. ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం ఉందని తెలిపారు.

భారత్‌లో అమలవుతున్న ఓటర్‌ గుర్తింపు విధానాన్ని అమెరికా ఎన్నికలతో పోల్చుతూ అక్కడ కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. 'మనం SAVE అమెరికా యాక్ట్‌ను ఇప్పుడు ఆమోదించాలి' అని ట్రంప్‌ తన పోస్టులో పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్టును భారత్​లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ రీషేర్ చేశారు. "అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అక్షరాలా నిజం! భారత్​లో జరిగిన గత ఎన్నికలలో 646 మిలియన్ల ఓటర్లలో, ప్రతి ఒక్కరికీ ఐడీ అవసరమైంది. కాంగ్రెస్ 'సేవ్ అమెరికా యాక్ట్'ను ఆమోదించాలి" అని కోరారు.

డొనాల్డ్ ట్రంప్‌ మద్దతు ఇస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరమయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఓటర్ల జాబితాల్లో పౌరసత్వ అర్హత లేని వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా కఠినతరం చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.

మెయిల్‌ ద్వారా ఓటింగ్‌పైనా పరిమితులు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అనారోగ్యం, వైకల్యం, సైనిక సేవ, ప్రయాణం వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే మెయిల్‌ ద్వారా ఓటు వేసే అవకాశం ఉండేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదనలో ఉంది. తక్షణమే ఈ బిల్లును ప్రతిపాదించాలని ట్రంప్‌ కోరుతున్నారు.

అమెరికా ఎన్నికల్లో పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేస్తున్నారన్న ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్‌ చాలాకాలంగా ప్రస్తావిస్తున్నారు. ‘అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు అమెరికా పౌరులకే ఉండాలి’ అన్నది ఆయన ప్రధాన వాదన.

అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎన్నికల డేటా ప్రకారం పౌరేతరుల అక్రమ ఓటింగ్‌ చాలా అరుదైన ఘటన అని విశ్లేషణలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని ట్రంప్‌ ఎన్నికల సంస్కరణల చర్చలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

కాగా సేవ్ అమెరికా యాక్ట్ బిల్లుపై అమెరికాలో తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. రిపబ్లికన్లు ఈ బిల్లును ఎన్నికల సమగ్రతను కాపాడే కీలక సంస్కరణ’గా అభివర్ణిస్తున్నారు. డెమొక్రాట్లు, పౌరహక్కుల సంస్థలు మాత్రం అదనపు గుర్తింపు, పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేయడంతో అర్హత ఉన్న వారు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

భారత్‌, అమెరికా ఎన్నికల వ్యవస్థలు, ఓటరు నమోదు విధానాలు, చట్టపరమైన నిబంధనలు ఒకేలా ఉండవు. కాబట్టి ఈ విధానాన్ని అమెరికాలో యథాతథంగా అమలు చేయడం సాధ్యమా? అనే చర్చ జరుగుతోంది.

భారత్‌‌లో ఓటర్లకు అధికారిక ఫొటో గుర్తింపు కల్పించడంతో పాటు, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఇతర గుర్తింపు పత్రాలను కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా, గుర్తింపు వ్యవస్థకు ఒక సమగ్ర చట్రం ఉండటం మన ప్రత్యేకత. అయితే అమెరికాలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఓటర్ ఐడీ కార్డు లేదు.

ఓటరు ఏ గుర్తింపు పత్రం చూపించాలన్న నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి మారుతాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఫొటో ఐడీని తప్పనిసరి చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు ఇతర గుర్తింపు పత్రాలను లేదా ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానాలను అనుమతిస్తున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటి పత్రాలు కొన్ని ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు. అమెరికా ఎన్నికల విధానంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ, అమెరికాలో 'సేవ్ అమెరికా యాక్ట్' ఆమోదించాలని డిమాండ్ చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story