Off The Record: సింగరేణిని ప్రక్షాళన చేయబోతున్నారా ?

Off The Record: సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు. అవినీతి ఆరోపణలు, పాత నేతల మార్పుపై అధిష్ఠానం దృష్టి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Aug 2026 7:20 AM IST
Off The Record
X

Off The Record: సింగరేణిని ప్రక్షాళన చేయబోతున్నారా ?

Off The Record: ఉద్యమంలో పురుడు పోసుకుని జాతీయ కార్మిక సంఘాలకే సవాల్ చేసిన టీబీజీకేఎస్‌ను సింగరేణి కార్మికులు సొంత యూనియన్‌గా ఆదరించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కార్మిక హక్కులు సాధించడంలో యూనియన్ కీలకంగా వ్యవహరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఏరియాల నేతలపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో అక్కున చేర్చుకున్న కార్మికులే యూనియన్‌కు దూరమయ్యారనే విమర్శలు వచ్చాయి. కారుణ్య నియామకాలు, కార్మికుల బదిలీలు, క్వార్టర్ల కౌన్సెలింగ్ వంటి వ్యవహారాల్లో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కారుణ్య నియామకాల్లో ఒక్కొక్కరి వద్ద 6 లక్షల నుంచి 8 లక్షల వరకు వసూళ్లు జరిగాయని, బదిలీల్లోనూ అందినకాడికి దోచుకున్నారని విమర్శలు వినిపించాయి.

మహిళా కార్మికుల పట్ల కొందరు టీబీజీకేఎస్ నేతల వ్యవహారశైలిపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇల్లందు, ఆర్జీ-1, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మహిళలను వేధించిన ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని ఘటనల్లో రాజీ ప్రయత్నాలు జరిగాయని, నేతలపై చర్యలు తీసుకోకుండా షిఫ్ట్ మార్పులతో సరిపెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

టీబీజీకేఎస్ నేతలపై వచ్చిన ఆరోపణలు చివరకు బీఆర్ఎస్‌పై ప్రభావం చూపాయని పార్టీ వర్గాలు, కార్మికులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలో సింగరేణి ప్రాంతంలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలవకపోవడానికి యూనియన్ నేతల వ్యవహారశైలీ ఒక కారణమనే చర్చ జరిగింది. కేసీఆర్ కార్మికుల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, టీబీజీకేఎస్ నేతల తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో యూనియన్‌ను ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కారు పార్టీ ముఖ్యనేత మంచిర్యాల పర్యటనలో.. యూనియన్‌లో మార్పులు చేస్తామని, రిటైర్ అయిన నేతలు ఎక్కువగా ఉన్నారని, యువతకు పెద్దపీట వేయాలని సూచించారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యూనియన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న ఆందోళన కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, కార్యకర్తలు మాత్రం యూనియన్‌లో సమూల మార్పులు చేయాలని కోరుతున్నారు. పాత నేతలను పక్కనపెట్టి యువతకు అవకాశం ఇస్తేనే కార్మికుల్లో మళ్లీ నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

2023లో జరిగిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రధాన పోటీ నుంచి తప్పుకుంది. అప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడం.. నాయకత్వ లోపం, కార్మిక సంఘం నేతలపై అవినీతి ఆరోపణలతో టీబీజీకేఎస్ బలహీనపడింది. దీంతో బీఆర్ఎస్‌ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్.. నామినేషన్‌కే పరిమితమైంది. ఫలితాల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచింది, ఐఎన్‌టీయూసీ 6 ఏరియాల్లో, ఏఐటీయూసీ 5 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచాయి.

రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం కీలక భూమిక పోషిస్తోంది. దాదాపు మూడు ఉమ్మడి జిల్లాలో సింగరేణి వ్యాపించి ఉంది. దాదాపు 35 నియోజకవర్గాలకు పైగా దీని ప్రభావం ఉంటోంది. కార్మిక సంఘం బలంగా ఉంటూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకుంటోంది. దీంతో.. టీబీజీకేఎస్ ప్రక్షాళనపై బీఆర్ఎస్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

స్థానికంగా బలంగా ఉన్న కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి.. కార్మిక సంఘానికి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది. బీఆర్ఎస్‌ అధినాయకత్వంతో విబేధాల వల్ల కవిత ఆ పార్టీకి దూరం కావడంతో.. 2025 ఆగస్టున ఆమెను టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆ స్థానంలో నియమించారు. ఇదిలా ఉంటే..

టీబీజీకేఎస్‌లో ఒకప్పుడు కీలకంగా ఉన్న కెంగర్ల మల్లయ్య 2022లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

మరి అధిష్ఠానం నిజంగానే ప్రక్షాళనకు సిద్ధమవుతుందా..? లేక పాత నేతలనే కొనసాగిస్తుందా..? టీబీజీకేఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా..? వేచి చూడాల్సిందే.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story