Burning Topic: నగరంలో ఎబోలా మహమ్మారి

Burning Topic: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం! ముగ్గురు అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2026 6:54 AM IST
Burning Topic
X

Burning Topic: నగరంలో ఎబోలా మహమ్మారి

Burning Topic: నిత్యం అత్యంత రద్దీతో కనిపించే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. సూడాన్ నుంచి వస్తున్న మహ్మద్ ఎప్పటిలాగే విమానం దిగి సిటీలోకి రావాలని అనుకున్నారు. అయితే విమానాశ్రయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల కేంద్రంలో అతనికి స్క్రీనింగ్ నిర్వహించారు.

ఆయనకు. ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్​కు తరలించారు. శాంపిల్స్​ సేకరించి సీసీఎంబీ పంపించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఎయిర్​పోర్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ప్రాణాంతక ఎబోలా మహమ్మారి పేరు వినగానే ప్రపంచం భయంతో ఉలిక్కిపడుతుంది. ఈ రాకాసి హైదరాబాద్ చేరిందనే వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కాగా గాంధీ ఆస్పత్రిలో మరో రెండు ఎబోలా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ లక్షణాలతో ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. తాజాగా ఇద్దరు ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి రక్త నమూనాలను సేకరించి, తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు అనుమానితులు ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ. సదరు ఫ్లైట్‌లో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ట్రాక్ చేస్తున్నారు.

ఆరేళ్ల క్రితం లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనాను ఎప్పటికీ మర్చిపోలేం. వాక్సిన్ అందుబాటులోకి రావడంతో క్రమంగా అది తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్‌ వణికిస్తోంది. గత నెల మేలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబోలా వెలుగు చూసింది. క్రమంగా ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు విస్తరించింది. మూడు దేశాల్లో కలిపి వెయ్యి మందికి పైగా సోకగా, 223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎబోలా తొలిసారిగా 1976 ఆగస్టులో కాంగోలోని యంబుకు అనే గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అక్కడి నది పేరు మీదుగానే దీనికి "ఎబోలా" అని పేరు పెట్టారు.

ఆఫ్రికాలో విస్తరిస్తున్న వైరస్‌ బుండిబుగ్యో రకానికి చెందినది. మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్‌లలో ఇది ఒకటి. ఎబోలాలో జైర్‌ రకం అనే స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్‌ నెమ్మదిగానే విస్తరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎబోలా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయడం తప్పనిసరని ఇదివరకే స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సూచనల ప్రకారం, భారత పౌరులు అత్యవసరం కాని పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల ఎబోలా వ్యాప్తిని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరు, జైపూర్‌, అహ్మదాబాద్ నగరాల్లో ఆఫ్రికా దేశాల నుండి వచ్చిన కొద్దిమంది ప్రయాణికులలో ఎబోలా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. వారిన నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకు నమూనాలు పంపగా, ఆ పరీక్షలలో నెగటివ్ అని తేలింది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గత 21 రోజులలో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించుకోవాలి. ఒకవేళ వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా శరీర భాగాల నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇతరులకు దూరంగా ఐసోలేట్ కావాలని సూచించింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story