Off The Record: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?

Off The Record: భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయికి చేరిన అంతర్గత విభేదాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2026 6:33 AM IST
Off The Record
X

Off The Record: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?

Off The Record: భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, పార్టీని రెండు వర్గాలుగా విభజించిన పరిస్థితి కనిపిస్తోందట. అధికారం చెలాయింపు విషయంలో నియోజకవర్గంలోని హస్తం నేతలకు అస్సలు పొసగడం లేదట. ప్రస్తుత ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు వర్గానికే అధిక ప్రాధాన్యత లభిస్తోందని వీరయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు. తాము తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాం...కష్టకాలంలో పార్టీని నిలబెట్టాం. కానీ ఇప్పుడు మాకు కనీస గుర్తింపు కూడా లేదని, పార్టీలోని ముఖ్య పదవులు, కమిటీలు, నామినేటెడ్ పోస్టులన్నీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికే కేటాయిస్తున్నారనే అసంతృప్తి సీనియర్ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వర్గం పెత్తనాన్ని.. నియోజకవర్గంలో పోదెం వర్గం అసలు సహించలేకపోతుందట.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన వారిని పక్కనపెట్టి, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొందరు నాయకులే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా మారారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టులు, ఇసుక రీచ్‌లు తదితర వ్యాపార ప్రయోజనాల కోసమే కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, ప్రస్తుతం వారే అధికారాన్ని ప్రభావితం చేస్తున్నారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల కిందిస్థాయి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కీలక పదవులన్నీ ఎమ్మెల్యే వర్గం వారికే కేటాయిస్తున్నారని మరో వర్గం వారు వాపోతున్నారు. సర్పంచ్ ఎన్నికలో బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికిన నాయకులే ఇప్పుడు చర్ల మండలంలో చక్రం తిప్పుతున్నారని వారి మాటే కొనసాగుతుందని

ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ కు మద్దతు పలికే నాయకులకే ప్రాధాన్యత కల్పిస్తే ఇన్నేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న మాకు విలువ ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కోసం జైలు పాలైన వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు.. నిన్నకాక మొన్నొచ్చిన వాళ్లే పార్టీలో అన్నీ నిర్ణయిస్తున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడబోమంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకు ముదురుతున్న వర్గ పొరుపై పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భద్రాచలం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వర్గ విభేదాలు,, కార్యకర్తల స్థాయికి చేరుకోవడంతో పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసంతృప్తులను అధిష్ఠానం ఎలా బుజ్జగిస్తుంది. వర్గ పోరుకు చెక్ పడుతుందా, లేక మరింత ముదురుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story