Off The Record: తూర్పుగోదావరిలో రసవత్తర రాజకీయం!

Off The Record: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల కన్ను. సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన మల్లగుల్లాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2026 9:02 AM IST
Off The Record
X

Off The Record: తూర్పుగోదావరిలో రసవత్తర రాజకీయం!

Off The Record: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 60పైగా జెడ్పీటీసీలు, వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలు, పెద్ద మొత్తంలో ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ జిల్లాపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ స్థానిక సమరాన్ని అధికార కూటమి గాని, ప్రతిపక్ష వైసీపీ కానీ 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి టీడీపీ, జనసేనలో చేరిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. తమ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమని భావిస్తున్న వారు అభ్యర్థిత్వాలపై స్పష్టత కోసం పార్టీ అధిష్ఠానాల వద్ద లాబీయింగ్ ప్రారంభించారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక నాయకులు తమ సామాజిక బలం, ఆర్థిక సామర్థ్యం, గత ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. అందులోభాగంగానే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అధికార కూటమి ఎమ్మెల్యేలు, కీలక నాయకుల కార్యాలయాల దగ్గర ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమిలోని టిడిపి, జనసేన పార్టీలకు సంబంధించిన కేడర్ చాలా ప్రాంతాల్లో బలంగా ఉండడంతో సీట్ల సర్దుబాటు అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను కొనసాగిస్తాయా? లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో మూడు పార్టీల ఆశావహులు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కూటమికి కత్తి మీద సాముల మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు.. కూటమి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండా సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్ కాకినాడ సిటీ, పెద్దాపురం. రాజానగరం. రాజోలు, అమలాపురం, పి.గన్నవరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన పార్టీలకు ద్వితీయశ్రేణి లీడర్లు బలంగా ఉండడం.. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో కూటమి నాయకులు సీట్ల పంపకాలు కూల్‌గా పూర్తవుతాయా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందులో భాగంగా ఈమధ్య తాడేపల్లిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధినేత జగన్‌.. ఇచ్చిన కీలక ఆదేశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించున్నాయి. రాష్ట్రంలోని పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించి ప్రతీ స్థానంలో పోటీ చేయాలని.. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని, గ్రామ స్థాయి నుంచి పార్టీ ఉనికిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నిరుత్సాహంలో ఉన్న కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గల ఇన్చార్జులు ఈ స్థానిక సంస్థలు ఎన్నికల్లో అధికార కూటమికి చెందిన నాయకుల ధాటికి తట్టుకొని, విజయం సాధించగల అభ్యర్థులను ఎంపిక చేయాలన్న వ్యూహంలో ఉన్నారట.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కుటమిపార్టీలకు బలహీనంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ఇందులోభాగంగా గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారట. మొత్తమ్మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపే లక్ష్యంతో గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడితో రాజకీయ వేడి రోజురోజుకూ రెట్టింపవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story