OFF The Record: అనంతపురం టీడీపీలో వర్గపోరు.. అధిష్టానానికి కొత్త తలనొప్పి!

OFF The Record: అనంతపురం టీడీపీలో ఎమ్మెల్యే దగ్గుపాటి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరి ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Aug 2026 11:24 AM IST
OFF The Record
X

OFF The Record: అనంతపురం టీడీపీలో వర్గపోరు.. అధిష్టానానికి కొత్త తలనొప్పి!

OFF The Record: అనంతపురం టీడీపీలో నెలకొన్న విబేధాలు ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించడం లేదట. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య వైరం నానాటికీ పెరుగుతోందట. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే అన్నీ తానై వ్యవహరిస్తూన్నారు.

డివిజన్లు, క్లస్టర్ల ఇన్చార్జిలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దగ్గుబాటి క్రియాశీలకంగా వ్యవహరిస్తూన్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో ఉన్నారట ఆయన.

గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ పొందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు వరకూ పార్టీ ఇంచార్జిగా ఉన్న ప్రభాకర్ చౌదరి మొదట్లో దగ్గుపాటికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు.

ప్రభాకర్‌ అనుచరులు టీడీపీ కార్యలయంపై దాడి చేయడంతో పాటు నిరసనలు తెలిపారు. ఆ టైంలో పార్టీ అధిష్టానం కలుగజేసుకుని నచ్చచెప్పడంతో ఎన్నికల్లో చౌదరి, ఆయన వర్గం కూటమి విజయానికి ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి పనిచేశారు.

అప్పట్లో అంతా కలిసిపోయినట్లు భావించినా... ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎప్పటికప్పుడు ఘర్షణలతో రచ్చకెక్కుతూండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త దళవాయి రమాదేవికి పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కేటాయించింది.

గవర్నర్ కోటాలో వర్ల రామయ్య తోపాటు ఆమెను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా నియమించింది. ఇద్దరు నేతలు శాసన మండలి సభ్యులుగా ప్రమాణ శ్వీకారం చేశారు. ఈ సందర్భంగా మరోమారు అనంతలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఒక్కసారిగా బహిర్గతమైంది.

ప్రభాకర్ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నాడని...కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భూ కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తూన్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అనంతపురంలో చాలామంది ఎమ్మెల్యే బాధితులు ఉన్నారని విమర్శించారు.

పూర్తీ ఆధారాలు తనవద్ద ఉన్నాయని... టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అన్ని విషయాలపై ఫిర్యాదు చేశానని చెప్పారు ప్రభాకర్ చౌదరి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనంతపురంలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని... పార్టీ కార్యకర్తలు, నేతలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

అంతకు ముందు చౌదరిపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఇక చౌదరి పని అయిపోయిందని కొందరు ప్రచారం చేశారు. చౌదరికి ప్రత్యామ్నాయంగా ఆమెకు పదవి ఇచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

రమాదేవిని క్షేత్రస్థాయిలో గుర్తించి పదవులు ఇచ్చింది గతంలో తానేనని చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానంను తాను పదవులు అడగలేదని తెలిపారు. ప్రభుత్వంలో పదవులు వస్తే స్వీకరిస్తామని.. లేదంటే కార్యకర్తగా పార్టీకి పనిచేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పుకొచ్చారు.

కావాలని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తూన్నారని మండిపడ్డారు. ఇటీవల చౌదరి అనుచరుడుగా ముద్రవేసుకున్న శ్రీనివాస చౌదరిపై ఎమ్మెల్యే కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికీ శ్రీనివాస చౌదరి బయట కనిపించడం లేదట. పార్టీ కోసం పనిచేసిన సీనియర్

నేతలు, కార్యకర్తలపై కావాలని తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూన్నారని పరోక్షంగా కూటమి ఎమ్మెల్యేపై..ప్రభాకర్ చౌదరి వర్గం నేతలు ఆరోపిస్తూన్నారు. అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుతో కొందరు కావాలని తప్పుడు పనులు చేస్తూన్నారని.. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తూన్నారని ముందు నుంచి

ఎమ్మెల్యే దగ్గుపాటి వాదిస్తూ వస్తూన్నారు. నగరంలో తలెత్తిన పలు వివాదాలు, అక్రమాలతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తీ అయినా.. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతల మధ్య సమన్వయం లేకపోవడంపై కార్యకర్తలు, కిందిస్థాయి నేతలకు ఇబ్బందిగా మారిందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతల

మధ్య నెలకొన్న విబేధాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తేనే పార్టీకి విజయం దక్కే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. చూడాలి మరి ప్రభాకర్‌ చౌదరి అసమ్మతిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో.? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రాజీ కుదిర్చి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటుందో..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story