Tirupati: డీఎస్సీ చర్చకు రాలేక ముఖం చాటేసిన వైసీపీ.. కూటమి నేతలు
Tirupati: కూటమి నేతలు విసిరిన డీఎస్సీ బహిరంగ చర్చ సవాల్‌కు వైసిపి నేతలు గైర్హాజరయ్యారు.
Tirupati: డీఎస్సీ చర్చకు రాలేక ముఖం చాటేసిన వైసీపీ.. కూటమి నేతలు
Tirupati: డీఎస్సీ మరియు స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా బహిరంగ చర్చకు రావాలని కూటమి నేతలు విసిరిన సవాల్‌కు వైసీపీ నాయకులు హాజరుకాలేదని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద రెండు గంటలపాటు కూటమి శ్రేణులు వేచిచూసినా వైసీపీ ప్రతినిధులు రాకపోవడం వారి ఆరోపణలకు ఆధారాల్లేవని నిరూపిస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16,347 మంది అభ్యర్థులు, వారి కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదని, వేలాది మంది నిరుద్యోగులు నిరాశకు గురయ్యారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు కూడా పూర్తి స్థాయి ధృవీకరణ అనంతరమే జరిగాయని, అర్హులకే ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలను TCS iON సాంకేతిక వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రశ్నాపత్రాలను ఎన్క్రిప్టెడ్ విధానంలో భద్రపరచడంతో పాటు ప్రతి అభ్యర్థికి వేర్వేరు ప్రశ్నల క్రమం ఉండేలా రాండమైజేషన్ అమలు చేశామని చెప్పారు.
బహుళస్థాయి భద్రతా వ్యవస్థల కారణంగా పేపర్ లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించిన నవీన్ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఆయన తదుపరి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎంపిక ప్రక్రియలకు హాజరుకాలేదని వివరించారు. కేవలం ర్యాంక్ రావడం ఉద్యోగానికి అర్హత కాదన్నారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగాయని, నిపుణుల కమిటీ పరిశీలన అనంతరమే ఎంపికలు జరిగాయని తెలిపారు. బ్రిడ్జ్ గేమ్‌ను పేకాటగా చిత్రీకరించడం సరైంది కాదని, దానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, విద్యా రంగంలో నమోదవుతున్న సానుకూల ఫలితాలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని కూటమి నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతోందని తెలిపారు.
డీఎస్సీ,స్పోర్ట్స్ కోటా అంశాలపై అన్ని ఆధారాలు, పత్రాలతో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులకు మరోసారి సవాల్ విసిరిన వారు, నిరాధార ఆరోపణలతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు.




