Renigunta: తిరుపతి - విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీస్ ప్రారంభం!

Renigunta: తిరుపతి నుంచి విజయవాడ, రాజమండ్రికి ఫ్లై91 కొత్త విమాన సర్వీసులు ప్రారంభం. వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Sept 2026 12:31 PM IST
Renigunta
X

Renigunta: తిరుపతి - విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీస్ ప్రారంభం!

Renigunta: తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు కొత్త విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ఈ విమాన సర్వీసును ప్రారంభించారు. తిరుపతి విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో తొలి విమానానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫైర్ విభాగం ఆధ్వర్యంలో వాటర్ కేనన్ సల్యూట్‌తో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా విమానాశ్రయ డైరెక్టర్ డి. భూమినాథన్‌తో పాటు ఇతర అధికారులు, ప్రముఖులు ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్‌లను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త సర్వీసును ప్రారంభించారు.

తిరుపతి దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వస్తుంటారని తెలిపారు. తిరుపతి నుంచి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌కు ఫ్లై91 సంస్థ ప్రారంభించిన ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి–కువైట్ వంటి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫ్లై91 సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్–తిరుపతి–విజయవాడ–తిరుపతి–హైదరాబాద్ విమాన సర్వీసు వారానికి నాలుగు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం) నడవనుంది. అలాగే హైదరాబాద్–తిరుపతి–రాజమండ్రి–తిరుపతి–హైదరాబాద్ సర్వీసు వారానికి మూడు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం) అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ నుంచి ఉదయం 7.40 గంటలకు తిరుపతి చేరుకునే విమానం 8.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 9.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

అదేవిధంగా రాజమండ్రి సర్వీసులో ఉదయం 8.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం 9.30 గంటలకు రాజమండ్రి చేరుకుని, తిరిగి 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story