Tada: తడ మండలంలో యువకుడిపై కత్తితో విచక్షణారహిత దాడి
Tada: తిరుపతి జిల్లా తడ మండలం వెండ్లురుపాడులో పవన్ అనే యువకుడిపై కత్తితో దాడి. దర్యాప్తు వేగవంతం చేసిన తడ పోలీసులు.
Tada: తడ మండలంలో యువకుడిపై కత్తితో విచక్షణారహిత దాడి
తడ: తిరుపతి జిల్లా నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో తడ పోలీసులు శోధన మరియు దర్యాప్తు వేగవంతం చేశారు. తడ మండలం వెండ్లురుపాడు గ్రామంలో ఒక యువకుడిపై కల్లు గీసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వెండ్లురుపాడు గ్రామానికి చెందిన పాలా పోలయ్య కుమారుడు పాలా పవన్ (27) ఈ నెల 3వ తేదీ రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి గుడి వద్ద పడుకుని ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన బూరగ వెంకటేశ్వర్లు సదరు గుడి స్థలం తన తండ్రికి సంబంధించిందని చెబుతూ తరచూ మద్యం మత్తులో వచ్చి అక్కడ ఉండే వారితో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అక్కడ పడుకుని ఉన్న పవన్‌తో వెంకటేశ్వర్లు గొడవకు దిగాడు.
గొడవ తీవ్రం కావడంతో ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు, రాత్రి 10:40 గంటల ప్రాంతంలో తన వద్ద ఉన్న కల్లు గీసే కత్తితో పవన్ గొంతు, వీపు, పొట్ట మరియు ఎడమ చేతి వేళ్లపై తీవ్రంగా నరికాడు. పవన్ శరీరం నుంచి పెద్ద ఎత్తున రక్తస్రావం కావడం గమనించిన స్థానికుడు రాజేష్ మరియు ఇతర గ్రామస్థులు వెంటనే బాధితుడిని సూళ్ళూరుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు ఆదేశాల మేరకు, సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ పర్యవేక్షణలో తడ ఎస్సైకె.కొండప్ప నాయుడు బాధితుడి తండ్రి పాలా పోలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.




