Renigunta: రేణిగుంట హైవేపై ఎర్రచందనం పట్టివేత.. ఐదు దుంగలు, కారు సీజ్!
Renigunta: రేణిగుంట-చెన్నై జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ మెరుపు తనిఖీలు. ఐదు ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం. కేరళకు చెందిన స్మగ్లర్ అరెస్ట్.
Renigunta: రేణిగుంట హైవేపై ఎర్రచందనం పట్టివేత.. ఐదు దుంగలు, కారు సీజ్!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట-చెన్నై జాతీయ రహదారిపై రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు.
ఈ ఘటనలో ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేయగా,మరో నిందితుడు పరారయ్యాడు.టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో,ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో,డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గదర్శకత్వంలో రైల్వే కోడూరు ఆర్ఎస్ఐ ఎన్. బాల చెంచయ్య బృందం,అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ సుభాష్‌తో కలిసి రేణిగుంట మండలం కరకంబాడి బీట్ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టారు.
శుక్రవారం అర్ధరాత్రి అనంతరం రామావిలాస్ సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా వేగంగా వచ్చిన కారును ఆపేందుకు ప్రయత్నించగా, వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును కొద్దిదూరంలో నిలిపి పారిపోయేందుకు యత్నించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంటాడి ఒకరిని అదుపులోకి తీసుకోగా,మరో వ్యక్తి తప్పించుకున్నాడు.
తనిఖీ చేయగా కారులో ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి వాటితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తి కేరళ రాష్ట్రంలోని కొళిక్కోడ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు,కారుతో పాటు నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అనంతరం డీఎస్పీ వి.శ్రీనివాసులు రెడ్డి,ఏసీఎఫ్ జె.శ్రీనివాస్ నిందితుడిని విచారించారు.ఈ మేరకు సీఐ ఖాదర్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




