Tirupati: తిరుపతి బైండ్ ఓవర్ ఉల్లంఘన రౌడీషీటర్‌కు కస్టడీ
Tirupati: తిరుపతి జిల్లాలో తొలిసారిగా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై కఠిన చర్యలు. రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్.
Tirupati: తిరుపతి బైండ్ ఓవర్ ఉల్లంఘన రౌడీషీటర్‌కు కస్టడీ
తిరుపతి: తిరుపతి జిల్లా పోలీసు శాఖ జిల్లాలోనే తొలిసారిగా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా, సంఘవిద్రోహ కార్యకలాపాల అరికట్టడంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోనే తొలిసారిగా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్‌కు చెందిన *సేతు దిలీప్ కుమార్ అలియాస్ తంబి (35)*పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసు నేపథ్యంలో రౌడీషీట్ తెరవబడింది. నేరప్రవృత్తికి దూరంగా ఉండేలా రేణిగుంట డీఎస్పీ సూచనల మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర ఈ ఏడాది ఏప్రిల్ 13న అతడిని రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు.
అయితే బైండ్ ఓవర్ అమల్లో ఉండగానే జూలై 6న తారకరామ నగర్‌లో జరిగిన కొట్లాట ఘటనలో సేతు దిలీప్ కుమార్ మళ్లీ పాల్గొన్నట్లు విచారణలో తేలింది. దీంతో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గురువారం అతడిని రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్ ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. బైండ్ ఓవర్ వంటి నిరోధక చర్యలను ఉల్లంఘించే వారికి ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, నేరాలకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. "చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడికి తిరుపతి జిల్లా పోలీసులు అండగా ఉంటారు. చట్టాన్ని ధిక్కరించే రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులపై ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయి" అని జిల్లా పోలీసులు హెచ్చరించారు.




