Tirupati: చరిత్రలో కలిసిపోనున్న తిరుపతి పాత రైల్వే స్టేషన్

Tirupati: రూ.300 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ. దశాబ్దాల చరిత్ర కలిగిన పాత భవనం కనుమరుగవుతుండటంతో జ్ఞాపకాల్లో నిలుస్తున్న స్టేషన్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 July 2026 5:03 PM IST
Tirupati
X

Tirupati: చరిత్రలో కలిసిపోనున్న తిరుపతి పాత రైల్వే స్టేషన్

తిరుపతి: తిరుపతి నగరానికి ఎన్నో దశాబ్దాలుగా గుర్తింపుగా నిలిచిన పాత రైల్వే స్టేషన్ భవనం త్వరలో చరిత్రలో కలిసిపోనుంది. భారతీయ రైల్వే చేపట్టిన ఆధునికీకరణ పనుల్లో భాగంగా పాత భవనాన్ని తొలగించి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త మోడల్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు.

తిరుమల యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తొలి స్వాగత ద్వారంగా నిలిచిన ఈ స్టేషన్‌తో స్థానికులకు ప్రత్యేక అనుబంధం ఉంది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ద్వారా గతంలో భక్తులు అలిపిరి కాలినడక మార్గానికి చేరుకునేవారు. స్టేషన్ ఎదుట గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, అనంతరం ఆటోలు, బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం విష్ణు నివాసం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు యాత్రికుల వసతి సముదాయం, తిరుమల బస్టాండ్ ఉండేది.

చారిత్రక నేపథ్యం

తిరుపతి రైల్వే స్టేషన్ 1891లో దక్షిణ భారత రైల్వే కంపెనీ ఆధ్వర్యంలో మీటర్ గేజ్ లైన్‌గా ప్రారంభమైంది. విల్లుపురం–కాట్పాడి–చిత్తూరు–పాకాల మీదుగా తిరుపతిని కలిపిన ఈ మార్గాన్ని 2003లో బ్రాడ్ గేజ్‌గా మార్చారు. ప్రస్తుతం రోజుకు వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటిగా నిలిచింది.

రూ.300 కోట్లకు పైగా వ్యయంతో పునర్నిర్మాణం

సుమారు రూ.300–321 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్తర, దక్షిణ వైపులా కొత్త స్టేషన్ భవనాలు, ఎయిర్ కాన్‌కోర్స్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని తలపించేలా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

అయితే తిరుపతి ప్రజలతో భావోద్వేగ అనుబంధం పెంచుకున్న పాత రైల్వే స్టేషన్ భవనం కనుమరుగవుతుండటం పలువురిని జ్ఞాపకాలలోకి తీసుకెళ్తోంది. నగర చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచిన ఈ కట్టడం ఇకపై జ్ఞాపకాలకే పరిమితం కానుంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story