Sullurupeta: సూళ్ళూరుపేటలో పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు!

Sullurupeta: మహిళల భద్రత, సైబర్ నేరాలు, మోటారు వాహన చట్టాలపై సూళ్ళూరుపేటలో పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎస్సై అజయ్ కుమార్ హెచ్చరిక.

KKV Sudhakar, Sullurupeta
Published on: 4 Sept 2026 4:44 PM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు!

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పరిశ్రమలు అధికంగా ఉండి, నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని, చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సూళ్ళూరుపేట ఎస్సై జి. అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు ఆధ్వర్యంలో, సీఐ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూళ్ళూరుపేట పట్టణంలోని పలు వార్డుల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు.

​ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై జి. అజయ్ కుమార్ మాట్లాడుతూ, పౌరులందరూ విధిగా వివిధ రకాల చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలపై అనుచిత వ్యాఖ్యలు లేదా వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నేటి సమాజంలో వేగంగా పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ నిబంధనల ప్రకారం అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవడం నేరపూరిత మోసాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ బాధితులుగా మారితే వెంటనే 1930 ఉచిత హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

​అలాగే మోటారు వాహనాల చట్టం (MVA) నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలు సీజ్ చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, వినియోగంపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, పట్టణంలో ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసు వ్యవస్థకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్సై జి. అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story