Sullurupeta: సూళ్ళూరుపేటలో దస్తావేజు లేఖర్ల నిరసన GO 396 రద్దు చేయాలి!
Sullurupeta: సూళ్ళూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల నిరసన. జీవో 396 రద్దు చేయాలని, తమ వృత్తికి లైసెన్సులు మంజూరు చేయాలని డిమాండ్.
Sullurupeta: సూళ్ళూరుపేటలో దస్తావేజు లేఖర్ల నిరసన GO 396 రద్దు చేయాలి!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ రంగంలో సేవనందిస్తున్న దస్తావేజు లేఖరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 396 (G.O. No. 396) ను వెంటనే రద్దు చేయాలని వారు తీవ్రంగా డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖరుల మరియు వారి కుటుంబాల ఉపాధి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు పరం చేయడం వల్ల ఎంతోమంది రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలు, స్థిరాస్థి క్రయ విక్రయదారులు అదనపు ఛార్జీలు, ఆర్థిక భారాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులో భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత క్లిష్టతరంగా మారుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో, దస్తావేజు లేఖరులకు అధికారికంగా లైసెన్సులు మంజూరు చేసి, వారి వృత్తికి చట్టపరమైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థిరాస్థి క్రయ విక్రయదారులు, రియల్ ఎస్టేట్ వర్గాలు మరియు ప్రజలందరూ ఈ విషయమై స్పందించి, దస్తావేజు లేఖరుల న్యాయమైన ఆందోళనకు మద్దతు తెలిపి వారి జీవనోపాధిని కాపాడడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి జీవో 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కె. మునిరాజ, వై. రాధాకృష్ణయ్య, టి. ముని సుబ్రహ్మణ్యం, పి. బాలయ్య, జి. శ్రీహరి, ఆర్. దుర్గ ప్రసాద్, టి. సురేష్, మోహన్, ఆసిస్టన్స్ తదితరులు పాల్గొన్నారు.




