Sullurupeta: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు!
Sullurupeta: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: సూళ్ళూరుపేట పిడిఎస్‌యు అవగాహన సదస్సులో సీఐ మురళీకృష్ణ పిలుపు.
Sullurupeta: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు!
Sullurupeta: యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.
తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని నందా ఫంక్షన్ హాల్‌లో ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం - దుష్ప్రభావాలు’ అనే అంశంపై పిడిఎస్‌యు (PDSU) ఆధ్వర్యంలో విద్యార్థి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ ఎం. మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, అటువంటి యువత చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సరదాగా ప్రారంభమయ్యే వ్యసనాలు జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, మానసికంగా, శారీరకంగా దెబ్బతినడమే కాకుండా కుటుంబాలకు ఆవేదన మిగులుస్తాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ అవగాహన సదస్సుకు పట్టణంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఐ మురళీకృష్ణ ఓపికగా సమాధానమిస్తూ, చట్టాలపై మరియు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు (PDSU) నాయకుడు లోకేష్, సూళ్ళూరుపేట ఎక్సైజ్ సీఐ సురేంద్ర, ఎస్సైలు శ్రీనివాసులు, మహేష్‌లతో పాటు డా.దనుంజయలు. ఇతర పోలీస్ సిబ్బంది, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




