Sullurpeta: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
Sullurpeta: సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పలు కీలక పనులకు నిధులు మంజూరు.
Sullurpeta: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నిరంతరం శ్రమిస్తున్నారు. మంగళవారం రోజున ఆమె అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాళంగి బ్రిడ్జి నిర్మాణం, కాళంగి నది వద్ద గ్రాయిన్ల నిర్మాణం, పులికాట్ సరస్సు నుండి ఉప్పునీరు పట్టణంలోకి చొచ్చుకురాకుండా నివారించేందుకు శాశ్వత రక్షణ చర్యలు, కొరిడి–పెర్నాడు రోడ్డు, వేనాడు రోడ్డు విస్తరణ వంటి కీలక మౌలిక వసతుల పనులకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి త్వరితగతిన పనులు చేపట్టాలని కోరారు.
మహిళా ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఈ కీలక పనుల ప్రాధ్యాన్యతను సీఎంకు స్పష్టంగా వివరించారు. కాళంగి నది వద్ద నూతన వారధి నిర్మాణంతో పాటు, నది వద్ద రాతి గ్రాయిన్ నిర్మిస్తే తీరకోత నివారించబడుతుందని తెలిపారు.
అలాగే పులికాట్ సరస్సు నుంచి ఉప్పునీరు పట్టణ ప్రాంతంలోకి చొచ్చుకుపోవడం వల్ల తాగునీరు కలుషితమవ్వడమే కాకుండా భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని, దీనిని అరికట్టేలా రక్షణ చర్యలు చేపట్టాలని విన్నవించారు. వీటితో పాటు కొరిడి–పెర్నాడు మరియు వేనాడు మార్గాల ఆధునీకరణతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగుపడతాయని వివరించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చూపిస్తున్న నిరంతర తపనను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే నిధులను మంజూరు చేసి ఈ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఎమ్మెల్యే శ్రమ ఫలిస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




