Sullurpeta: భార్యను హత్య చేసిన నిందితుడు పనబాక శ్రీనివాసులు అరెస్ట్
Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కోటపోలూరులో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు.
Sullurpeta: భార్యను హత్య చేసిన నిందితుడు పనబాక శ్రీనివాసులు అరెస్ట్
సూళ్ళూరుపేట: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని, ఆమెను దారుణంగా హత్య చేసిన భర్త పనబాక శ్రీనివాసులును శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు.
సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన పనబాక శ్రీనివాసులుకు, సంధ్య అనే మహిళతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి తిరుమల (12), చంద్రిక (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు కొన్నాళ్లుగా మద్యానికి బానిసై, భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఆమెతో గొడవ పడుతూ వేధింపులకు గురిచేసేవాడు.
గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత తీవ్రమవడంతో, ఆవేశానికి లోనైన శ్రీనివాసులు భార్య సంధ్యపై దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాసులును ప్రత్యేక బృందాలతో గాలించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ వివరించారు.
సమాజంలో మద్యపానం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సూళ్ళూరుపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ గంటా అజయ్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




