Sullurpeta: సూళ్ళూరుపేటలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై మెరుపు దాడులు రూ.15 వేల జరిమానా

Sullurpeta: HMTV కథనంతో స్పందించిన సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య. రాజధాని హోటల్ సహా 5 షాపులపై ఆకస్మిక తనిఖీలు. నిల్వ మాంసం పట్టివేత.

KKV Sudhakar, Sullurupeta
Published on: 3 July 2026 2:53 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై మెరుపు దాడులు రూ.15 వేల జరిమానా

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ​సూళ్ళూరుపేట పట్టణంలోని ఆహార విక్రయ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై HMTV యాప్‌లో వెలువడిన కథనంతో మున్సిపల్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ‘మన సూళ్ళూరుపేట-మన శుభ్రత’ నినాదంతో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య రంగంలోకి దిగి పట్టణంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజధాని హోటల్, లాసి షాప్, డోటో షాప్‌లతో పాటు మొత్తం 5 షాపుల్లో భారీగా నిల్వ ఉంచిన పదార్థాలను, తీవ్ర అపరిశుభ్రతను అధికారులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ 5 షాపులకు కలిపి మొత్తం రూ. 15,000 జరిమానా విధించారు.

​తనిఖీల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్ మాంసాన్ని, పాడైపోయిన ఇతర ఆహార పదార్థాలను వంటలకు వాడుతున్నట్లు తేలింది. అపరిశుభ్రమైన నూనెలను పదే పదే వేడి చేయడం, వంటకాల్లో ప్రమాదకర రంగులను కలపడం వంటివి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయని కమిషనర్ మండిపడ్డారు. వ్యాపారులు లాభాల కక్కుర్తితో భారీగా నిల్వ ఉన్న పదార్థాలను విక్రయిస్తూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని, ఇలాంటి అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

​వ్యాపారులు FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, వంట గదులు మరియు పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు. ముఖ్యంగా నిల్వ ఉంచిన మాంసాహారాన్ని వడ్డించడం, వంటకు కలుషిత నీటిని వాడటం, సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం, వ్యర్థాలను బహిరంగంగా రోడ్ల పక్కన పడేయడం వంటివి కఠినంగా నిషేధించామని తెలిపారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనని, తదుపరి తనిఖీల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే వ్యాపార అనుమతులను నిలిపివేయడం జరుగుతుందని సూచించారు.

​అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్న HMTV పాత్రను ప్రశంసిస్తూ, అపరిశుభ్ర పరిస్థితులు కనిపిస్తే మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని మున్సిపల్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ మెరుపు దాడులు స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో మరిన్ని తనిఖీలు ఉంటాయని అధికారులు తెలిపారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story