Srikalahasti: శ్రీకాళహస్తిలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరి అరెస్ట్

Srikalahasti: శ్రీకాళహస్తిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్. రూ.1.20 లక్షల విలువైన ఆభరణాలు, ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 23 July 2026 2:18 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరి అరెస్ట్

శ్రీకాళహస్తి: జూలై 7వ తేదీ రాత్రి శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి గ్రిల్స్, ప్రధాన ద్వారం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ కె. నరసింహమూర్తి పర్యవేక్షణలో, వన్ టౌన్ సీఐ శ్రీ సి. వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటుచేసి విస్తృతంగా విచారణ నిర్వహించారు.

దర్యాప్తులో తిరుపతికి చెందిన అక్కుర్తి నవీన్ అలియాస్ లవ్ లీ, డేరంగుల జగదీష్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నవీన్‌పై 24, జగదీష్‌పై 8 పాత క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి వీరు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

జూలై 22న నిందితులను అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల బరువు గల ఒక జత బంగారు కమ్మలు, నేరానికి ఉపయోగించిన ఒక ఆటో, రెండు ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.1.20 లక్షలు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సీఐ సి. వెంకటేష్, ఎస్‌ఐ ఎం. రామకృష్ణ, డబ్ల్యూఎస్‌ఐ స్వాతి, ఏఎస్‌ఐలు ఆనందయ్య, గంగయ్య, పీసీలు శంకరయ్య, భానుతేజతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ కె. నరసింహమూర్తి అభినందించారు.

ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ సి. వెంకటేష్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ... ఇంటికి తాళాలు వేసి బయట ప్రాంతాలకు వెళ్లే వారు ఇంట్లో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా విలువైన వస్తువులు ఇంట్లో ఉంచాల్సి వస్తే ముందుగానే పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story