Sullurupeta: శ్రీహరికోట షార్‌లో కార్మికుల ధర్నా

Sullurupeta: కాంట్రాక్ట్ కార్మికులకు దక్కని కనీస వేతనాలు, బోనస్.. జూన్ 18న కేంద్ర కార్మిక శాఖ విచారణకు సీఐటీయూ సంచలన ప్రకటన.

KKV Sudhakar, Sullurupeta
Published on: 31 May 2026 8:39 PM IST
Sullurupeta
X

Sullurupeta: శ్రీహరికోట షార్‌లో కార్మికుల ధర్నా

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ​సూళ్ళూరుపేట (శ్రీహరికోట) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో కాంట్రాక్టు కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం వేతనాలు, సదుపాయాలు అందడం లేదని, నిబంధనలను కాంట్రాక్టర్లు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని సీఐటీయూ (CITU) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రీన్ క్రాస్ అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సంస్థకు చెందిన కాంట్రాక్టర్ కడియం రాజమండ్రి.. షార్‌లో గార్డెన్ వర్క్ నిమిత్తం అక్టోబర్ 2024లో జెమ్ (GeM - గవర్నమెంట్ ఈ-మార్కెట్) ద్వారా ఒక సంవత్సరం కాలపరిమితికి ఆర్డర్ పొందారని తెలిపారు. అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్న నాటి నుండి నేటివరకు కార్మికులకు కనీస వేతన పట్టిక (Wage Slip) ఇవ్వడం లేదని, చట్ట ప్రకారం అందాల్సిన కనీస వేతనం, పెరిగిన కరువు భత్యం (DA), మరియు బోనస్ వంటి ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా కార్మికులకు వర్తింపజేయడం లేదని మండిపడ్డారు.

దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ప్రైమ్ మినిస్టర్ పరిధిలోని అంతరిక్ష విభాగంలోనే ఇంతటి భారీ స్థాయిలో కార్మిక చట్టాల ఉల్లంఘనలు జరగడం అత్యంత శోచనీయమని నాయకులు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ వైఖరితో విసిగిపోయిన కార్మికులు సీఐటీయూను ఆశ్రయించగా, ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు జూన్ 18, 2026 న హైదరాబాద్‌లోని కేంద్ర కార్మిక శాఖ అధికారి సమక్షంలో విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్మికులకు రావలసిన పూర్తి బకాయిలు చెల్లించి, చట్టప్రకారం సదుపాయాలు కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సీఐటీయూ బాధ్యులు మరియు షార్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story