Tirupati: శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం.. 1711 మందికి పట్టాల పంపిణీ
Tirupati: తిరుపతిలో సుమారు 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూ సమస్యకు కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది.
Tirupati: శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం.. 1711 మందికి పట్టాల పంపిణీ
Tirupati: దశాబ్దాలుగా కొనసాగుతున్న శెట్టిపల్లి భూ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సోమవారం తిరుపతి నగరంలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన శెట్టిపల్లి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి భద్రతతో కూడిన నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ శెట్టిపల్లి భూ సమస్య దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. 2014లో ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లగా వెంటనే సర్వే చేపట్టారని, అనంతరం 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భూ సమీకరణ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి ప్రభుత్వం ముగింపు పలికిందన్నారు.
2018లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎనిమిదేళ్ల తర్వాత విజయవంతమైందని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు, పార్కులు, పాఠశాలలు, వాణిజ్య స్థలాలతో సమగ్ర టౌన్‌షిప్ రూపకల్పన చేశామని వివరించారు.తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శెట్టిపల్లి సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. పేద లబ్ధిదారులపై భారం పడకుండా రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. జనవరి 15న ఈ-డిప్ లాటరీ విధానంలో పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టామని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ ఈ-డిప్ విధానంలో మొత్తం 1711 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా భూ కేటాయింపులు జరిగాయని తెలిపారు. అందులో 1432 హౌస్ సైట్స్, 279 అగ్రికల్చర్ సైట్స్ ఉన్నాయని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.సుధీర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. విజయశ్రీ, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




