Renigunta: భారీ డ్రగ్స్ రాకెట్ ఛేదనం: ముగ్గురు నిందితుల అరెస్ట్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం. బెంగళూరు టు తిరుపతి డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు ముఠా అరెస్ట్.
Renigunta: భారీ డ్రగ్స్ రాకెట్ ఛేదనం: ముగ్గురు నిందితుల అరెస్ట్!
Renigunta: రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల మెత్ (ఎండీఎంఏ) డ్రగ్స్ స్వాధీనం..
ముగ్గురు అరెస్ట్
మీడియా తో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు..
తిరుపతి జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో గుణ శేఖర్ (26), అశ్విన్ కుమార్ (30), రాహుల్ యాదవ్ (30) ఉన్నారు. వీరి వద్ద నుంచి 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు డిజిటల్ వెయింగ్ మిషన్లు, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర పోలీసు శాఖ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ పర్యవేక్షణలో, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో, రేణిగుంట అర్బన్ సీఐ ఎస్. జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా నిర్వహించింది.
ఈ నెల 9వ తేదీన రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. విచారణలో బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి తిరుపతి–రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులపై NDPS చట్టం–1985 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. నిందితులను చాకచక్యంతో పట్టుకున్నందుకు రేణిగుంట పట్టణ సీఐ జై చంద్ర మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ అభినందించారు.




