Pernadu: HMTV కథనంతో కదిలిన యంత్రాంగం: పెర్నాడు పీహెచ్‌సీలో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆకస్మిక తనిఖీ..
Pernadu: పెర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్లక్ష్యంపై HMTV ప్రసారం చేసిన స్పెషల్ ఫోకస్ కథనానికి తక్షణ స్పందన లభించింది.
సూళ్ళూరుపేట: మారుమూల గ్రామాల ప్రజలకు సైతం మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలు అందించాలనే ప్రభుత్వ ఆశయాలకు కొందరు అధికారులు పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని పెర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో అక్కడి అమాయక ప్రజల ఆరోగ్యంతో ఘోరంగా చెలగాటం ఆడుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో అన్నీ సదుపాయాలు ఉన్నా, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అది దాదాపు నిరుపయోగంగా మారింది. దీనిపై హెచ్ఎంటీవీ ఆధారాలతో సహా ప్రసారం చేసిన ఇన్వెస్టిగేటివ్ కథనానికి తక్షణ స్పందన లభించింది. ఈ కథనంతో కదిలిన సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ శనివారం పెర్నాడు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రి రిజిస్టర్‌లో డాక్టర్ సహా 16 మంది సిబ్బంది నిత్యం విధులు నిర్వహిస్తున్నట్టు రికార్డులు పక్కాగా రాస్తూ, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మందులను సిబ్బంది స్వయంగా తగలబెడుతున్న దారుణాన్ని హెచ్ఎంటీవీ బట్టబయలు చేసింది. నిత్యం అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ వారానికి ఒకసారి వస్తుండగా, నర్సులు కేవలం పగటిపూట మాత్రమే ఉండి సాయంత్రానికి ఆసుపత్రిని ఖాళీ చేసి వెళ్తున్నారు.
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు గ్రామానికి వస్తుండగా, స్థానిక గ్రామస్థులు రోడ్డుపైనే ఆమె కారును అడ్డుకున్నారు. గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు హారతి ఇచ్చి, తమ గోడును కన్నీళ్లతో వివరించారు. అమ్మా.. మాది రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామం. పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏదైనా ఆపద వచ్చి ఇక్కడికి వెళితే నర్సులు నోటికొచ్చినట్టు తిడుతూ, ఎలా చావకపోతే మాకెందుకు అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డాక్టర్ గారైతే నెలకు ఒకసారే వస్తున్నారు. మాకు ఈ సిబ్బంది వద్దు, తక్షణమే మార్చండి" అని వేడుకున్నారు.
అనంతరం ఆసుపత్రి లోపలికి వెళ్లిన ఎమ్మెల్యేకు తీవ్ర అపరిశుభ్రత కనిపించింది. కేవలం డాక్టర్ గది మినహా ఎక్కడా కనీసం శుభ్రం చేసిన దాఖలాలు లేవు. డస్ట్ బిన్లు కూడా లేకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం బీపీ, బరువు లాంటి ప్రాథమిక పరీక్షలు కూడా చేయకుండానే వైద్యం అందిస్తుండడంపై ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ఆసుపత్రికి పేషెంట్ వస్తే అసలు ఏం ఇబ్బంది ఉందో చూడకుండా.. నేరుగా ఒక ఇంజక్షన్ వేయడం, లేదా సెలైన్ ఎక్కించేసి పంపేయడం లాంటి దారుణమైన పద్ధతులపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ, వచ్చిన రోగులను అస్సలు పట్టించుకోకుండా కేవలం తన గదికే పరిమితం కావడంపై ఎమ్మెల్యే అగ్నిహోత్రుడయ్యారు. "ఆసుపత్రికి వచ్చామా, వెళ్లామా అన్నట్టు కాకుండా.. వచ్చిన రోగులను బాధ్యతగా పట్టించుకోవాలి. ప్రాథమిక పరీక్షలన్నీ చేసి, బీపీ అంతా చూశాకే కదా వైద్యం చేయాలి!" అని వైద్యుడికి, నర్సులకు క్లాస్ పీకారు. "నేను కూడా ఒక డాక్టర్ వృత్తి నేపథ్యం నుండి వచ్చినదాన్నే.. నాకు వైద్య విధానాలన్నీ పూర్తిగా తెలుసు. ఇలాంటి నిర్లక్ష్యపు పద్ధతులు ఇక్కడ సాగనివ్వను" అంటూ ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రి తీరు మారాలని, తక్షణమే వైద్య సేవలు మెరుగుపడాలని ఆదేశించారు.
నిరుపేద ప్రజల ఆరోగ్య సమస్యలను, సిబ్బంది బరితెగింపును ప్రభుత్వం దృష్టికి తెచ్చిన హెచ్ఎంటీవీ ఛానెల్‌ను ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ప్రత్యేకంగా అభినందించారు. కథనంలోని ప్రతి సమస్య నిజమేనని, త్వరలోనే పెర్నాడు PHC రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంటీవీ చేసినఈ పోరాటంతోనైనా పెర్నాడు ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశిద్దాం.




