Sullurupeta: సూళ్ళూరుపేట అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే విజయశ్రీ కీలక భేటీ

Sullurupeta: సూళ్లూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సుదీర్ఘ భేటీ.. పలు కీలక ప్రతిపాదనలు అందజేత.

KKV Sudhakar, Sullurupeta
Published on: 23 May 2026 10:52 AM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేట అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే విజయశ్రీ కీలక భేటీ

సూళ్ళూరుపేట: తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల చిరకాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్‌ ఎస్. వెంకటేశ్వర్ ను స్వయంగా కలిసి పలు అత్యంత ప్రాధాన్యత గల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ భేటీలో పలు కీలక ప్రతిపాదనలను కలెక్టర్ ముందు ఉంచారు. ముఖ్యంగా అటకానితిప్ప - పెర్నాడు రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు అత్యంత కీలకమైన DGPS సర్వే నిర్వహణ, అందుకు అవసరమైన నిధుల మంజూరుపై చర్చించారు. అలాగే సూళ్లూరుపేట అన్నా క్యాంటీన్ నియోజకవర్గ ప్రజలకు, పేదలకు మరింత అనుకూలంగా మరియు అందుబాటులో ఉండేలా స్థల మార్పు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ప్రజల ప్రధాన రాకపోకల సమస్యను తీర్చే విధంగా టౌన్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల పురోగతిని సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మామిడి కాలువపై కాజ్ వే నిర్మాణ పనుల మంజూరుతో పాటు, నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మరికొన్ని మౌలిక వసతుల పనులకు నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి, నిధుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ అభివృద్ధి పంథాలో సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతామని, ప్రజా సంక్షేమమే తమ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story