Tada: లారీ ఢీకొని జార్ఖండ్ యువ మహిళా ఇంజనీర్ అక్కడికక్కడే మృతి

Tada: తడ మండలం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని జార్ఖండ్‌కు చెందిన యువ ఇంజనీర్ అంకితకుమారి (25) దుర్మరణం. డ్రైవర్ అరెస్ట్.

KKV Sudhakar, Sullurupeta
Updated on: 3 July 2026 2:37 PM IST
Tada
X

Tada: లారీ ఢీకొని జార్ఖండ్ యువ మహిళా ఇంజనీర్ అక్కడికక్కడే మృతి

తడ: తిరుపతిజిల్లా తడ మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసిటీ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ఒక యువ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం, రామ్‌ఘర్ జిల్లాకు చెందిన అంకితకుమారి (25) శ్రీసిటీలోని ఒక ప్రముఖ పరిశ్రమలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

​నిత్యం మాదిరిగానే శుక్రవారం ఉదయం ఆమె తన ద్విచక్ర వాహనంపై విధులకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఆమె బైక్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి అంకితకుమారి రోడ్డుపై పడి తీవ్ర రక్తస్రావానికి గురయ్యారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

​సమాచారం అందుకున్న తడ ఎస్సై కొండప్పనాయుడు వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అంకితకుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.

​స్వస్థలానికి వేల మైళ్ల దూరంలో ఉపాధి కోసం వచ్చి, కెరీర్‌లో రాణిస్తున్న సమయంలోనే అంకితకుమారి అకాల మరణం చెందడం పట్ల తోటి ఉద్యోగులు, శ్రీసిటీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్‌ఘర్ నుండి ఎంతో ఆశలతో వచ్చి, పారిశ్రామిక రంగంలో ఇంజనీర్‌గా స్థిరపడిన యువతి ఇలాంటి ప్రమాదంలో మరణించడం ఆ ప్రాంతంలో విషాదచాయలను నింపింది. అంకితకుమారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్ల విస్తరణ, వాహనాల వేగ నియంత్రణ విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story