Renigunta: అధికారుల నిర్లక్ష్యం.. యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా!
Renigunta: తిరుపతి ముఖద్వారం రేణిగుంట పరిసర ప్రాంతాల్లో గోవుల అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు, గో సంరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Renigunta: అధికారుల నిర్లక్ష్యం.. యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా!
రేణిగుంట: పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రానికి ముఖద్వారమైన రేణిగుంట పరిసర ప్రాంతాల్లో గోవుల అక్రమ తరలింపుపై స్థానికులు, గో సంరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవులను వాహనాల్లో తరలిస్తూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
శనివారం రాత్రి రేణిగుంట మంచినీళ్ళ గుంట పార్క్ ముఖద్వారం సమీపంలో గోవులు గుంపులుగా సంచరిస్తుంటాయని,అయితే కొంతమంది వ్యక్తులు వాటిని బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గోవులను అక్రమంగా కసాయిఖానాలకు తరలించి మాంసం విక్రయాల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం జ్యోతినగర్ ప్రాంతంలో గోమాంసం విక్రయాలు అధికంగా జరుగుతాయనే కారణంతో ముందురోజు రాత్రే గోవులను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గోవులను వాహనాల్లో కుక్కి, వాటికి కనీస రక్షణ లేకుండా తరలిస్తున్న ఘటనలను అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ కళ్లముందే మూగజీవాలను తరలిస్తున్నా సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పట్ల గో సంరక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతకట్ట పార్క్, జ్యోతినగర్ పరిసర ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గోవుల అక్రమ తరలింపుపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తరలింపునకు పాల్పడుతున్న వారిని గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి ముఖద్వారంగా ఉన్న రేణిగుంటలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, గోవుల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే గోవుల అక్రమ తరలింపుదారులకు ధైర్యం వస్తోందని గో సంరక్షకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేణిగుంట పరిధిలో రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, గోవుల అక్రమ తరలింపును అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




