Gajulamandyam: గాజులమండ్యంలో నకిలీ ఇంటి పట్టాల మోసం.. మహిళ అరెస్ట్
Gajulamandyam: నకిలీ జగనన్న ఇంటి పట్టాలతో రూ.12 లక్షలకు పైగా మోసానికి పాల్పడ్డ నిందితురాలు కాసి శశికళను అరెస్ట్ చేసిన గాజులమండ్యం పోలీసులు. మరొకరి కోసం గాలింపు.
Gajulamandyam: గాజులమండ్యంలో నకిలీ ఇంటి పట్టాల మోసం.. మహిళ అరెస్ట్
గాజుల మండ్యం: నకిలీ జగనన్న ఇంటి స్థల పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిన కేసులో పరారీలో ఉన్న రెండో నిందితురాలు కాసి శశికళ (34)ను గాజులమండ్యం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట టౌన్ పరిధిలోని రామకృష్ణాపురం క్రాస్, జ్యోతినగర్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కె. భారతి కుటుంబ సభ్యులకు అడుసుపాలెం జగనన్న కాలనీలో ప్రభుత్వ ఇంటి స్థల పట్టాలు ఇప్పిస్తామని నమ్మించి, నిందితులు జయసుధ, కాసి శశికళ కలిసి నాలుగు ప్లాట్ల పేరుతో మొత్తం రూ.12,05,999 వసూలు చేశారు. అనంతరం ఇచ్చిన పట్టాలు నకిలీవని తహశీల్దార్ కార్యాలయంలో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో కాసి శశికళ 2018 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రేణిగుంట తహశీల్దార్ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయాలను ఉపయోగించుకుని, మొదటి నిందితురాలు జయసుధతో కలిసి ప్రజలను మోసం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పలువురికి నకిలీ ఇంటి స్థల పట్టాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసినట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం నిందితురాలిని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టగా, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, సంబంధిత పత్రాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న తొలి నిందితురాలు జయసుధ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇతరుల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై కూడా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు, ఇంటి పట్టాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను నమ్మవద్దని, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వేదికల ద్వారానే ధృవీకరించుకోవాలని గాజులమండ్యం పోలీసులు ప్రజలకు సూచించారు. అలాగే ఇలాంటి మోసాలకు గురైన వారు లేదా సమాచారం ఉన్న వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.




