Gajulamandyam: జాతీయ పోషణ మాసం, ఆత్మహత్యల నివారణపై అవగాహన
Gajulamandyam: గాజులమండ్యం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ పోషణ మాసం, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Gajulamandyam: జాతీయ పోషణ మాసం, ఆత్మహత్యల నివారణపై అవగాహన
గాజులమండ్యం: జాతీయ పోషణ మాసం–2026, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గాజులమండ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు హెల్త్ సూపర్వైజర్ కామరాజు ఆరోగ్య సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామరాజు మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు, పండ్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా పరిశుభ్రమైన తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరుగుదొడ్లను వినియోగించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని తెలిపారు. చదువు, పరీక్షలు, కుటుంబ పరిస్థితులు తదితర కారణాలతో ఒత్తిడికి గురైనప్పుడు సమస్యలను మనసులో దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలని సూచించారు.
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని విద్యార్థులకు వివరించారు. నిరాశ, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. “మాట్లాడుదాం.. విందాం.. తోడుగా నిలుద్దాం.. జీవితాన్ని కాపాడుకుందాం” అనే సందేశంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సుభాషిణి, తేజ, చాముండేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.




