Sullurupeta: డీఎస్సీ అక్రమాలపై ఉధృతమైన వైఎస్‌ఆర్‌సీపీ పోరు!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో డీఎస్సీ అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.
Sullurupeta: డీఎస్సీ అక్రమాలపై ఉధృతమైన వైఎస్‌ఆర్‌సీపీ పోరు!
సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ లీకు అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరియు నాయకులు భారీ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణ వీధుల్లో నిర్వహించిన ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికలలో ప్రజలకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తీవ్రంగా విమర్శించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో కొత్త జీవోలు విడుదల చేసి, అనంతరం ఆ జీవోలను హడావుడిగా రద్దు చేయడం వెనుక భారీ అక్రమాలు, కుంభకోణం దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌తో కలిసి అడుగులు వేసిన వారికి, చురుగ్గా పాల్గొన్న వారి అనుచరులకు మాత్రమే అక్రమ మార్గాల్లో డీఎస్సీ ఉద్యోగాలు కట్టబెట్టేందుకే ఈ రకమైన నాటకానికి తెరతీశారని మరియు ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద స్కామ్ జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఈ ర్యాలీలు, ధర్నాలు మరియు ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, 'సూపర్ సిక్స్' పథకం సూపర్ హిట్ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను, ప్రజలను ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ఈ నిరసన ర్యాలీలో సూళ్ళూరుపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లూరు అనిల్‌రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, సుమంత్ రెడ్డి, సూళ్ళూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, మిజూరు రామకృష్ణారెడ్డి, జెట్టి వేణుయాదవ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని నిరసనను విజయవంతం చేశారు.




