Renigunta: ప్రైవేట్ స్కూళ్లలో రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలకు నో ఎంట్రీ!

Renigunta: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతే లక్ష్యంగా విద్యాశాఖ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Aug 2026 9:03 PM IST
Renigunta
X

Renigunta: ప్రైవేట్ స్కూళ్లలో రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలకు నో ఎంట్రీ!

రేణిగుంట: విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, ప్రశాంతమైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల ఎదుట విద్యార్థుల భద్రత,పాఠశాల ప్రాంగణంలో పాటించాల్సిన నిబంధనలను వివరిస్తూ ప్రత్యేక హెచ్చరికల బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.‘విద్యార్థుల భద్రత–మన అందరి బాధ్యత’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌లో విద్యార్థి సంఘాలు,రాజకీయ గ్రూపులు,ప్రైవేట్‌ సంస్థలు,అనధికార వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.

పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు,ప్రచారాలు,రాజకీయ జెండాలు,బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి కార్యకలాపాలకు తావులేదని పేర్కొన్నారు.పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు,ఇతర సందర్శకులు సైతం నిర్దేశిత నిబంధనలను పాటించిన తర్వాతే పాఠశాలలోకి ప్రవేశించాలని సూచించారు.

విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠశాల ప్రాంగణంలో క్రమశిక్షణ, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు,ఫిర్యాదులు ఉంటే నేరుగా పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.

విద్యార్థులపై అనవసర ప్రభావం,రాజకీయ జోక్యం లేకుండా ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని కొనసాగించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.విద్యార్థుల భద్రత,క్రమశిక్షణ,విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల వద్ద ఇలాంటి స్పష్టమైన నిబంధనలను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story