Mamnoor Airport : తెలంగాణకు మరో విమానాశ్రయం.. రూ.496.86 కోట్లతో కేంద్రం గ్రీన్ సిగ్నల్

Mamnoor Airport : వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో ఏఏఐ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చిందని కేంద్రం ప్రకటించింది.

CR Reddy
Published on: 21 July 2026 7:43 AM IST
Mamnoor Airport
X

Mamnoor Airport

Mamnoor Airport : తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు పౌర విమానయాన శాఖ నుంచి ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుపై అత్యంత కీలక ప్రకటన వెలువడింది.

పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంలో రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. రన్ వే విస్తరణ, ఆప్రాన్, ట్యాక్సీ వే, కాంపౌండ్ వాల్ వంటి మౌలిక వసతుల కల్పనకు ఏఏఐ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

కాకతీయుల శైలిలో టెర్మినల్ డిజైన్

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామునూరు విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి సారించింది. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేసి నిధులు కేటాయించింది. వరంగల్ చారిత్రక నగరమైనందున, ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను కాకతీయుల ప్రాచీన శిల్పకళా వైభవంతో అత్యంత సుందరంగా డిజైన్ చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం మిగతా చట్టబద్ధ అనుమతులు, భూసేకరణ పనులను త్వరితగతిన ముగిస్తే శంకుస్థాపన చేసి పనులను వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.

ఇతర ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా కొత్త విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్ మరియు మిలిటరీ ఉమ్మడి అవసరాల కోసం వినియోగించేందుకు ఏఏఐ అధ్యయనం పూర్తి చేసి, అదనపు భూమి వివరాలను రాష్ట్రానికి పంపినట్లు చెప్పారు. పెద్దపల్లిలో నిర్వహించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి అందించారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం, చెంచుపల్లి, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన స్థలంలో మాత్రం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్రం స్పష్టం చేసింది. అక్కడ సమీపంలోనే కొండలు, రైల్వే లైన్లు ఉండటం వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు భద్రతాపరంగా ప్రమాదకరమని అధ్యయనంలో తేలిందని వివరించారు. ఇక రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ఇప్పటివరకు తెలంగాణలో 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story